చూసి రమ్మని చెబితే కాల్చి వచ్చే బాపతులో మన బ్యాంకు అధికారులను చేర్చవచ్చు. ఆర్బీఐ బ్యాంకుల సిబ్బందికి ఒకరకం ఆదేశాలు జారీ చేస్తే సిబ్బంది వాటిని మరొకరకంగా అర్థం చేసుకుని అమలు చేస్తే సామాన్యుడికి నరకం తప్పదు కదా. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా జారీ చేసిన రూ. 2,000, 500 నోట్లపై ఏదైనా రాతలు రాస్తే వాటిని తీసుకోమని బ్యాంకు సిబ్బంది చెప్పడమే కాకుండా దాన్ని అమలు చేయడంతో జనం మామూలు బాధలు పడలేదు. తీరా చూస్తే రిజర్వ్ బ్యాంకు అలాంటి ఆదేశాలు వేటినీ బ్యాంకులకు జారీ చేయలేదట. సిబ్బంది అత్యుత్సాహం, ఓవరాక్షన్ కారణంగానే ఆర్బీఐ ఆదేశాలివ్వకపోయినా రాసిన నోట్లను తీసుకోకుండా సమస్యలు సృష్టించారు.
తాజా సమాచారం ఏమిటంటే.. కరెన్సీ నోట్లు రంగు వెలిసినా, వాటిపై రాతలు ఉన్నా బ్యాంకులు వాటిని తీసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అలాంటి నోట్లను ‘మాసిన నోట్లు’గా పరిగణించి ‘స్వచ్ఛ నోటు విధానం’ ప్రకారం వ్యవహరించాలని పేర్కొంది. కరెన్సీ నోట్లను.. ముఖ్యంగా రాతలున్న రూ.500, రూ.2,000 నోట్లను బ్యాంకు స్వీకరించడం లేదని ఫిర్యాదులు రావడంతో ఆర్‌బీఐ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.