రైల్వే కుటుంబంతో గడిపిన అనుభవాలు చిరస్మరణీయం : సురేష్ ప్రభు

ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (16:34 IST)
రైల్వే మంత్రిత్వ శాఖ బాధ్యతల నుంచి సురేష్ ప్రభు ఆదివారం ఉదయం పూర్తిగా తప్పుకున్నారు. గత నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండు రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రభు... రైల్వే మంత్రికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన కేంద్ర పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొత్త రైల్వే మంత్రిగా పియూష్ గోయెల్‌ను నియమించారు. దీంతో సురేష్ ప్రభుత్వ రైల్వే శాఖ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. 
 
కేంద్ర కేబినెట్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. రైల్వే శాఖా మంత్రిగా తన బాధ్యతలు ముగిశాయన్నారు.
 
ఇంత కాలం తనకు సహాయ సహకారాలు అందించిన రైల్వే కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. రైల్వేలలో సహాయం, సమస్యల పరిష్కారానికి ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల వివరాలను ఈ సందర్భంగా పోస్టు చేశారు. 
 
13 లక్షల మందితో కూడిన రైల్వే కుటుంబంతో గడిపిన అనుభవాలు తనకు చిరకాలం గుర్తుంటాయని ఆయన తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొత్త మంత్రులు మరింత బాగా పని చేస్తారని సురేష్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సురేష్ ప్రభుకు వాణిజ్య శాఖను కేటాయించారు. 

 

Thanks to all 13 Lacs+ rail family for their support,love,goodwill.I will always cherish these memories with me.Wishing u all a great life

— Suresh Prabhu (@sureshpprabhu) September 3, 2017

వెబ్దునియా పై చదవండి