పుల్వామా ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసేందుకు భారత్ నాలుగువైపుల నుంచి దాడి చేస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అత్యంత అభిమాన దేశాల (ఎంఎఫ్ఎల్) దేశాల జాబితా నుంచి పాకిస్థాన్ పేరును భారత్ తొలగించింది. ఇపుడు మరో దెబ్బ కొట్టింది. పాకిస్థాన్ నుంచి దిగుమతి అన్ని రకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 200 శాతానికి పెంచింది. ఇది పాకిస్థాన్ దేశ ఆర్థిక రంగంపై తీవ్రప్రభావం చూపనుంది.
ఇందులోభాగంగా కఠినతరమైన ఆర్థిక ఆంక్షల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాయాది దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించుకున్న కేంద్రం తాజాగా ఆ దేశానికి మరో పిడుగుపాటు లాంటి నిర్ణయాన్ని వెలువరించింది. పాకిస్థాన్ నుంచి దిగుమతయ్యే అన్నిరకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 200 శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
జైట్లీ ప్రకటించిన ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్ మనదేశానికి చేసే ఎగుమతులపై సుమారు రూ.49 వేల కోట్ల మేర ప్రభావం చూపనుంది.పాకిస్థాన్ నుంచి భారత్ ప్రధానంగా ముడి ప్రత్తి, నూలు, కెమికల్స్, ప్లాస్టిక్, రంగులు దిగుమతి చేసుకుంటోంది. ఈ వస్తువులపై కస్టమ్స్ సుంకం భారీగా పెంచేసింది. ఫలితంగా వీటిని భారతీయ వ్యాపారులు ఇకపై దిగుమతి చేసుకునే అవకాశం లేదు.