దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును అత్యంత రహస్యంగా ఉంచడానికి గల కారణాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సదస్సులో ప్రసంగించారు.
నోట్లు రద్దుచేస్తామని ముందుగానే ప్రకటిస్తే.. నల్లధనం దాచుకున్న వాళ్లు తమ వద్ద ఉన్న డబ్బును బంగారం, వజ్రాలు, భూముల కొనుగోళ్లు తదితర వాటికి మళ్లించే అవకాశం ఉండేదన్నారు. ఈ విషయంలో పారదర్శకత పాటిస్తే.. భారీ మోసానికి అదో సాధనంగా మారిపోయేదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్లరద్దు నిర్ణయం, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు.
పారదర్శకత అనేది ఎంతో గొప్ప పదం. కానీ నోట్లరద్దు లాంటి విషయాల్లో దాన్ని పాటిస్తే పెద్ద మోసానికి అవకాశమిచ్చేదిగా ఉండేదని అభిప్రాయపడ్డారు. 'తీసుకున్న నిర్ణయాలపై గోప్యత పాటించడం అవసరం. నోట్లరద్దు నిర్ణయం గొప్ప విజయం సాధించింది. దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన జట్టు, ఆర్‌బీఐ అన్నీ కలిసి పనిచేశాయి. అంతేకాకుండా నిర్ణయం తీసుకొనేటప్పుడే ప్రత్యామ్నాయ నోట్లను ముద్రించాం. ఈ ముద్రణలో వేలాదిమంది భాగస్వాములయ్యారు. కానీ ఎందుకు చేస్తున్నారో మాత్రం వాళ్లకు తెలియలేదు' అని అన్నారు.