నాదగ్గరికి వస్తే చాలు.. బాదిపడేస్తాను జాగ్రత్త అంటూ చెప్పి మరీ బాదుతోంది భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ). పైగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అనే బిల్డప్ ఒకటి. వినియోగదారులకు అది ఎంత షాక్ ఇచ్చిందంటే తక్షణ నగదు చెల్లింపు సేవ కింద ఇకపై చేసే నగదు బదిలీలపై జీఎస్టీతో కలిపి మరీ చార్జీలు వసూలు చేస్తానని తేల్చి చెప్పేసింది.
వివరాల్లోకి వెళితే దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్సఫర్ ఛార్జీల్లో మార్పులు చేసింది. జీఎస్టీ నేపథ్యంలో కొత్త చార్జీలను ప్రకటించింది. మారిన నిబంధనల ప్రకారం వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు గల నగదు ట్రాన్స్‌ఫర్లకు రూ.5 + జీఎస్టీ, లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు గల నగదు ట్రాన్స్‌ఫర్లకు రూ. 15 + జీఎస్టీ వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు వెల్లడించాయి.
జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్నుల విధానంలో.. బ్యాంకింగ్ సేవలకు గాను జీఎస్టీని 18 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా నగదు బదిలీ సేవలకు చార్జీలను మార్పు చేసినట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్వీటర్ ద్వారా తెలిపింది. మొబైల్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదును తక్షణమే బెనిఫిషియరీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసే వెసులుబాటును ‘ఐఎంపీఎస్ సర్వీస్’ అంటారు.
సెలవు రోజులు సహా 24 x 7 సమయంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. రూ.1000 లోపు ఎటువంటి చార్జీలు లేకున్నా ఆ తర్వాతి నుంచి లక్ష రూపాయల వరకు రూ.5+జీఎస్టీ, రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+జీఎస్టీని ఖరారు చేసింది. అంటే ఇక నుంచి స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే నగదు బదిలీలన్నింటిపైనా తాజా చార్జీలు వర్తిస్తాయి.