పెరుగుపైనా జీఎస్టీ బాదుడు... ఈ నెల 18 నుంచి అమలు

ఆదివారం, 17 జులై 2022 (10:53 IST)
"వన్ నేషన్... వన్ ట్యాక్స్" పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి వస్తువుపైనా పన్నును ముక్కుపిండి వసూలు చేస్తుంది. చివరకు తినే ఆహార పదార్థాలపైనా కూడా జీఎస్టీ బాదుతోంది. తాజాగా ప్యాక్‌ చేసి లేబుల్‌ వేసిన పెరుగు ధరపై కూడా ఈ పన్నును వసూలు చేయనుంది. 
 
ఒక్క పెరుగే కాదు.. ప్యాక్‌ చేసి లేబుల్‌ వేసిన మజ్జిగ, పన్నీర్‌, లస్సీ వంటి పాల ఉత్పత్తులు ధరలూ జీఎస్టీ కారణంగా పెరగనున్నాయి. అలాగే, టూర్‌కు వెళ్లినపుడు రూం అద్దె వెయ్యి రూపాయలలోపు గది తీసుకున్నా 12 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సిందే. 
 
ఇటీవల జీఎస్‌టీ మండలి 47వ సమావేశంలో రేట్ల పెంపు నిర్ణయ ఫలితమిదీ. కొన్ని వస్తువులకు కొత్తగా రేట్ల వర్తింపజేయగా.. మరికొన్ని వస్తువులను వేరే స్లాబ్‌ రేటులోకి మార్చారు. దీంతో వాటి ధరలు పెరగనున్నాయి. తాజాగా కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు సైతం ఈ రేట్లను నోటిఫై చేసింది. దీంతో జులై 18 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి రానున్నాయి. 
 
ప్యాక్‌ చేసిన లేబుల్డ్‌ గోధుమపిండి, అప్పడాలు, పన్నీర్‌, పెరుగు, మజ్జిగ, లస్సీ, మాంసం (ఫ్రోజెన్‌ మినహాయించి), చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లు-మఖానా, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్‌ పైనా ఇక నుంచి 5 శాతం జీఎస్టీ పడుతుంది. ఇప్పటివరకు వీటికి మినహాయింపు ఉంది. అయితే, ప్యాక్‌ చేయని, లేబుల్‌ వేయని, అన్‌బ్రాండెడ్‌ ఉత్పత్తులకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది.
 
రూ.1000 కంటే తక్కువ విలువైన హోటల్‌ గదుల అద్దెపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తారు. ఇప్పటివరకు వెయ్యికన్నా ఎక్కువ విలువైన హోటల్‌ గదులపైనే జీఎస్టీ వర్తించేది. ఆసుపత్రిలో ఒక రోగికి రూ.5000కి మించి గది (ఐసీయూకు మినహాయింపు) అద్దె తీసుకుంటే, ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ పడనుంది.
 
ప్రింటింగ్‌, రైటింగ్‌, డ్రాయింగ్‌ ఇంక్‌లపై పన్ను 12 నుంచి 18 శాతానికి పెంచారు. కాబట్టి వీటి ధరలు ఆ మేర పెరగనున్నాయి. కత్తులు, కటింగ్‌ బ్లేడ్లు, పేపర్‌ కత్తులు, పెన్సిల్‌ చెక్కుకునే షార్ప్‌నర్లపైనా ఇకపై 18 శాతం పన్ను వర్తించనుంది. ఎల్‌ఈడీ లైట్లు, ఫిక్సర్‌, వాటికి వినియోగించే మెటల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌బోర్డులపై 12 నుంచి 18 శాతానికి పెంచారు. సోలార్‌ వాటర్‌ హీటర్‌, సిస్టంపై 5 శాతంగా ఉన్న పన్ను 12 శాతానికి పెంచారు.
 
టెట్రా ప్యాక్‌పై 12 నుంచి 18 శాతానికి పెంచారు. చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్‌వర్క్‌లపై 5 నుంచి 12 శాతానికి పెరిగింది. రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, శ్మశానవాటికల కాంట్రాక్టు వర్కులపై 12 నుంచి 18 శాతానికి పెంచారు. కట్‌ అండ్‌ పాలిష్డ్‌ వజ్రాలపై 0.25 నుంచి 1.5 శాతానికి పెంచారు. చెక్కులు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే ఛార్జీపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. 
 
మ్యాప్‌లు, ఛార్టులు, అట్లాస్‌పై 12 శాతం పన్ను పడుతుంది. బ్యాటరీ ప్యాక్‌ అమర్చినా, లేకున్నా విద్యుత్తు వాహనాలకు 5 శాతం జీఎస్టీ ఖరారు చేశారు. ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏ, సెబీ వంటి నియంత్రణ సంస్థల సేవలపైనా పన్ను విధిస్తారు. వ్యాపార సంస్థలకు ఇచ్చే నివాసాలకూ జీఎస్టీ వర్తిస్తుంది.
 
ఆస్టమీ, కొన్ని ఆర్థోపెడిక్‌ ఉపకరణాలకు పన్నురేటు 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. రోప్‌వే ద్వారా ప్రయాణికులు, సరకు చేరవేత సేవలపై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గింపు. ఇంధనం ధర కలిపి అద్దెకు తీసుకునే ట్రక్‌, సరకు రవాణా వాహనాల అద్దెపై పన్ను 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు