కార్ల దిగ్గజం హ్యాందాయ్ సరికొత్త కారును తయారు చేసింది. ప్రమాదకరమైన, దుర్గమైన రహదారుల్లో ప్రయాణించేందుకు ఈ కారును రూపొందించారు. సాధారణంగా కారు మామూలు రోడ్డు ఉంటేనే ముందుకు సాగుతుంది. కొండలు గుట్టలు దానికి పనికిరావు.
అయితే, హ్యూందాయ్ తాజాగా ఆవిష్కరించిన కారు మాత్రం ఎలాంటి ప్రదేశాల్లోనైనా వెళుతుంది. ఈ కారును సోమవారం లాస్‌వెగాస్‌లో ప్రదర్శించిన ఎలివేట్ కారు సాలీడులా పొడవాటి కాళ్లమీద నడుస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే రోబోను, కారును సంకరం చేస్తే ఇది తయారైందని చెప్పొచ్చు.
మనిషి కాలు తరహాలో మోకాలు, చీలమండ కీలుతో కూడిన కాళ్లు దీని ప్రత్యేకత. విద్యుచ్ఛక్తితో ఇది నడుస్తుంది. దీనిని సర్వోన్నతమైన చలనయంత్రంగా చెప్పుకుంటున్నారు. కొండలపైన లేదా మామూలుగా అయితే వెళ్లలేని ప్రదేశాల్లోకి అన్వేషణ కొరకు, ప్రమాదాల సమయాల్లో దీనిని పంపించవచ్చు. ఇది ఎక్కడికైనా సులభంగా వెళ్లగలుగుతుంది.