విమాన సంస్థలకు ఊరట - ఏటీఎఫ్ ధరలు తగ్గింపు

శనివారం, 16 జులై 2022 (14:59 IST)
విమాన సస్థలకు చమురు కంపెనీలు ఊరట కలిగించే వార్తను చెప్పాయి. విమానాల్లో ఇంధనంగా వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్) ధరను తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఏటీఎఫ్‌ ధరను 2.2 శాతం మేర తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు శనివారం ప్రకటించాయి. దీంతో ఏటీఎఫ్‌ ధర కిలో లీటర్‌కు రూ.3,084.94 మేర తగ్గి రూ.138,147.93కి చేరింది. అంతకుముందు ఈ ధర రూ.141,232.87గా (లీటర్‌ రూ.₹141.23) ఉంది.
 
ఏటీఎఫ్‌ ధరను ప్రతి నెలా ఒకటో, 16వ తేదీన సమీక్షిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా వీటిధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆయిల్‌ కంపెనీలు ఏటీఎఫ్‌ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 
 
అంతకుముందు జూన్‌ 16న ఏటీఎఫ్‌ ధరను ఏకంగా 16 శాతం మేర చమురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా ఈ ఏడాదిలో 11 సార్లు వీటి ధరలను పెంచారు. దీంతో గడిచిన ఆరు నెలల్లో వీటి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే వీటి ధరలు తగ్గించారు. చివరి సారిగా జూన్‌ 1న ఏటీఎఫ్‌ ధరలను 1.3 శాతం మేర తగ్గించగా.. తాజాగా మరో 2.2 శాతం తగ్గించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు