ముకేశ్ అంబానీ కేసులో కీలక మలుపు.. SUV ఓనర్ మృతి

శనివారం, 6 మార్చి 2021 (09:03 IST)
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ముకేశ్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు కలిగిన వాహనం యజమాని హిరేన్‌ మన్‌సుఖ్‌ (45) మరణించినట్టు థానె పోలీసులు శుక్రవారం తెలిపారు. థానె శివార్లలోని ఓ కాల్వలో అతని మృతదేహాన్ని కనుగొన్నట్టు చెప్పారు. అయితే మన్‌సుఖ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. 
 
గురువారం రాత్రి నుంచి మన్‌సుఖ్‌ కనిపించడంలేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, కొన్ని రోజులుగా తనను స్థానిక పోలీసులు వేధిస్తున్నారని మన్‌సుఖ్‌ ఇటీవల ఫిర్యాదు చేసినట్టు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
 
అయితే ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద నిలిపిన స్కార్పియో వాహనం మన్‌సుఖ్‌ది కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ శుక్రవారం చెప్పారు. కారు రిపేరింగ్‌ కోసం ఒకతను మన్‌సుఖ్‌కు ఈ కారును ఇచ్చారని తెలిపారు. 
 
ఈ కేసును రాష్ట్ర యాంటీ-టెర్రరిజమ్‌ స్కాడ్‌ (ఏటీఎస్‌)కు బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఘటనపై బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ కేసు మీద ఎన్‌ఐఏ కూడా విచారణ జరుపుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనిల్‌ పరబ్‌ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు