టమోటాలు - ఉల్లుపాయల వంతు అయిపోయింది.. ఇపుడు వెల్లుల్లి వంతు వచ్చింది..

గురువారం, 12 అక్టోబరు 2023 (13:43 IST)
ఇటీవలికాలంలో దేశ వ్యాప్తంగా టమోటా, ఉల్లిపాయల ధరలు ఆకాశానికి అంటాయి. కేజీ టమోటాల ధర ఏకంగా రూ.400 వరకు పలికింది. అదేవిధంగా ఉల్లిపాయల ధరలు కూడా రూ.200కు పైగా చేరింది. ఇపుడు వెల్లుల్లి వంతు వచ్చింది. దీని ధర ప్రస్తుతం కేజీ రూ.280కు చేరింది. ముంబై హోల్ సేల్ మార్కెట్‌లో కిలో వెల్లుల్లి ధర రూ.160గా ఉండగా, సరఫరా కారణంగా రిటైల్ మార్కెట్‌లో ఈ ధర రూ.280కి చేరిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
నవీ ముంబై మార్కెట్‌లో నిత్యం 24 నుంచి 30 వాహనాల్లో వచ్చే వెల్లుల్లి స్టాకు ప్రస్తుతం బాగా తగ్గిపోయిందని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ తెలిపింది. ఇపుడు రోజుకు 15 నుంచి 20 ట్రక్కులకు మించి రావడం లేదని తెలిపింది. సరఫరా కూడా దాదాపుగా 40 శాతం మేరకు పడిపోయిందని  పేర్కొంది. దీంతో మార్కెట్‌లో వెల్లుల్లి ధర పెరుగుతుందని వివరించారు. మే నెలలో కిలో వెల్లుల్లి ప్రారంభ ధర రూ.30 నుంచి రూ.60గా ఉండేది. ఇపుడు ఇది రూ.280కు చేరుకోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు