పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పసిడిని కొనాలనుకునే వారికి చేదువార్తను వెల్లడించింది. ఇకపై దేశంలో ఎక్కడ బంగారం కొనాలంటే పాన్‌కార్డ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. నల్లధనాన్ని గోల్డ్ రూపంలో మార్చుకోవాలని యోచన చేస్తున్న నల్లదొంగలను ఈ వార్త మరింత ఆందోళనకు గురి చేసింది.
స్వచ్ఛందంగా నల్లధనాన్ని ప్రభుత్వానికి అప్పగించక తప్పేలా లేదు. పాన్ నంబర్లు ఇవ్వని నల్లదొంగల పనిపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. అంతేకాదు, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30వరకూ జరిగే అన్ని నగదు డిపాజిట్లపై కేంద్రం నిఘా పెట్టనుంది. 2.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరి అకౌంట్ వివరాలను నిశితంగా పరిశీలించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఆదాయపన్ను శాఖకు ఆదేశాలు కూడా వెళ్లాయి.
నోట్ల మార్పిడి పిటీషన్ తిరస్కృతి..
మరోవైపు.. నోట్ల మార్పిడిని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశాన్ని పట్టి పీడిస్తోన్న నల్లధనం, నకిలీనోట్లను అరికట్టడానికి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన అడ్వొకేట్ వివేక్ నారాయణ్ శర్మ, ఉత్తరప్రదేశ్ చెందిన అడ్వొకేట్ సంగంలాల్ పాండే వేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేంద్రప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల చలామణి అంశంలో ఉత్తర్వులు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది కోరారు. అయితే, వాదనలు విన్న అనంతరం నోట్ల మార్పిడిపై దాఖలైన ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లో సమగ్రత లోపించిందని అందుకే తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.