దేశవ్యాప్తంగా ఇప్పుడు వ్యాపారుల్లో, వినియోగదారుల్లో ఆందోళన పీక్ వెళ్లిపోతోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను జీఎస్టీ వల్ల దేశమంతా ఒకే పన్ను విధానం త్వరలో అమలు కానుంది కాబట్టి కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయని, మరికొన్ని పెరుగుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ దఫా వినియోగదారులు కూడా పెరిగే వస్తువుల ధరల పట్ల ఆందోళనతో దొరికినకాడికి తక్కువ ధరలకు వస్తువులు కొనేయాలని సిద్ధమవుతున్నారు. ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు ఆందోళన చెందుతున్నందువల్ల భారీ కొనుగోళ్లు, విక్రయాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
వ్యాపారులు గతంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషిన్లు, ఓవెన్స్, వాచీలు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలకు సంబంధించి ఇప్పటికే చాలా స్టాకు మిగిలింది. జీఎస్‌టీ అమలులోకి వస్తే పన్ను అధికంగా వేస్తారన్న భయంతో కొందరు వ్యాపారులు ఆయా వస్తువుల ధరలపై ఐదు నుంచి పది శాతం తగ్గింపుతో విక్రయించేస్తున్నారు. దీంతో వినియోగదారులు కూడా ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రతినెలా మధ్యతరగతి, పేద వర్గాలు ఇంటి అవసరాలకు బియ్యం, గోధుమలు, పాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తారు. వీటిపై జీఎస్‌టీ తగ్గించడంతో ఆయా ధాన్యాలపై కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు ధర తగ్గే అవకాశాలున్నాయి. వంటనూ నెలపైనా పన్ను తగ్గడంతో లీటర్ నూనెపై ఇదే స్థాయిలో ధర తగ్గుముఖం పడతాయి. తలనూనె, సబ్బులు, టూత్‌పేస్టులపైనా పన్ను 24 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి ధరలు రూ.5 నుంచి రూ.8 వరకూ తగ్గే అవకాశాలున్నాయి. దీంతో వేతనజీవులు, నిరు పేదల నెల బడ్జెట్ తగ్గుతుంది. వేతనజీవులు నెలవారీగా నిత్యావసరాలకు రూ.5 వేలు ఖర్చు చేస్తుంటే.. జూలై నుంచి వారికి నెలకు రూ.500–1,000 వరకు మిగులు ఉండే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.
జీఎస్‌టీ అమలుతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు సుమారు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే జీఎస్‌టీ విలాస వస్తువులపైనే అధికంగా ఉంది. నిత్యావసరాలపై తక్కువగా ఉంది. ఈ పన్ను పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటగానే ఉంది. న్యాయంగా వ్యాపారం చేసేవారికి జీఎస్ టీ బాగానే ఉంటుంది. దొంగ వ్యాపారులకే ఇబ్బందికరం అని కొందరు వ్యాపారులు పేర్కొనడం విశేషం.