ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండటం,లాక్ డౌన్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన డెవలపర్లకు డబ్బు సమస్యలు ఎక్కువ కావడం వంటి కారణాలతో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ధరలను తగ్గించి విక్రయాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ తరుణంలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రియల్టర్లు నష్టపోయారు. గత మూడు నెలలుగా ముంబైలో ఇల్లు, ఫ్లాట్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించకపోవటంతో ధరను తగ్గించి అయినా విక్రయాలు జరపాలని, డబ్బు రొటేషన్ అయితేనే బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి ధరలను తగ్గిస్తున్నారు. అంతేకాదు డబ్బులు ఆలస్యంగా చెల్లిస్తామని చెప్పినా సరే డెవలపర్లు ఒప్పుకుంటున్నారు.
ఇంట్లో దిగే అంతవరకూ చెల్లింపులపై వడ్డీలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మరీ అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ముంబైలోని దాదాపు 70 శాతం ప్రాజెక్టుల ధరలు తగ్గాయని ప్రాప్‌స్టక్ స్టడీ తెలిపింది. సెకండరీ మార్కెట్లోనూ తక్కువ ధరలకే ఆస్తులు అందుబాటులో ఉన్నాయని మరో స్టడీ వెల్లడించింది.