'అన్న‌య్య'కు 'త‌మ్ముడు' షాక్, జియోకు మించి ఆర్‌కామ్ బంపర్ ఆఫర్... రూ.149కే అపరిమిత కాల్స్...

మంగళవారం, 22 నవంబరు 2016 (21:16 IST)
ముంబై : అన్న ముఖేశ్ అంబానీ జియోకు తమ్ముడు అనిల్ అంబానీ ఆర్ కామ్‌తో షాకిచ్చారు. వెల్‌కమ్ ఆఫర్‌తో దేశంలోని టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియోకు అనిల్ సారథ్యంలోని ఆర్‌కామ్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోరకంగా చెప్పాలంటే మొత్తం మొబైల్ వినియోగదారులను తనవైపు తప్పుకునేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.149 రీచార్జ్‌తో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చంటూ, ఇవాళ బంపరాఫర్ ప్రకటించింది. అంతేకాక ఉచితంగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని పేర్కొంది. 2జీ, 3జీ, 4జీ వినియోగదారులందరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని వివరించింది.
 
తాజా ఆఫర్ ఇంచుమించు ‘జియో’ను పోలి ఉంది. కానీ, జియో ఆఫర్ కొన్ని ఫోన్లు... అది కూడా 4జీ ఫోన్లకే పరిమితం కాగా ఆర్‌కామ్ ఆఫర్ అన్ని ఫోన్లలోనూ ఉపయోగించుకోవచ్చు. తాజా ఆఫర్‌ దేశంలో మొబైల్ రీచార్జ్‌లో విప్లవం వంటిదని ఆర్‌కామ్ సీఈవో గురుదీప్ సింగ్ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
తాజా ఆఫర్ 17 ఆర్‌కామ్ సర్కిళ్లలో అందుబాటులో ఉందని, ఐదు తూర్పు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, అసోంతోపాటు ఆర్‌కామ్ నెట్‌వర్క్ లేని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని తెలిపారు. దేశంలో లక్షలాది మంది 2జీ ఫోన్లు కలిగిన వినియోగదారులు ఉన్నారని, వారందరూ ఈ ప్లాన్‌ను చక్కగా ఉపయోగించుకోవచ్చని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి