జీఎస్టీ పుణ్యమా అని కార్లధరలు విపరీతంగా తగ్గుతున్నాయని పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు కొని పడేసే మోజులో ఉన్నారా.. అయితే ఇది మీకు సరిపోని వార్తే మరి. శిలాజ ఇంధనాలతో అంటే పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల శకం చాలా స్పీడుగా అదృశ్యం కానుంది. చమురుతో నడిస్తూ ప్రపంచ రహదారులపై రాజసం ఒలికించిన కార్లు, ఇతర వాహనాలకు కాలం చెల్లిపోతోంది. సమీప భవిష్యత్తులోనే విద్యుత్‌తోపాటు నేరుగా సౌరశక్తితోనే నడిచే కార్లు, వాహనాలు బోలెడన్ని మార్కెట్‌లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి.
ఇప్పటికే సౌరశక్తితో నడిచే కార్ల నమూనాలు ప్రపంచం మొత్తానికి ఆశలు రేపుతున్నాయి. కారు, ఇతర వాహనాల బాడీ మొత్తాన్ని సౌర ఫలకలతో నింపి సౌరవిద్యుత్తును ఆదా చేస్తే ఒక రోజుంతా ఈ ఫలకలు ఆదా చేసిన విద్యుత్తులో కాలుష్యం జోలికి పోకుండా ఏకథాటిగా 750 కిలోమీటర్లు నడిపేయవచ్చునట. అంటే పెట్రోలు, డీజిళ్ల వంటి ఇంధనాలేవీ లేకుండా కేవలం సూర్యుడి శక్తితోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లపోవచ్చునన్నమాట.
యూరప్‌కి చెందిన ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఇప్పటికే నిర్మించి రోడ్డుపైకి తెచ్చిన లైట్ ఇయర్ వన్‌తో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. ఏ దశలోనైనా ఎండ అనేది దొరక్క కారు నిలిచిపోతే.. సాధారణ విద్యుత్ ప్లగ్‌ను వాడుకుని చార్జ్ చేసుకునే సౌకర్యమూ ఉంది దీంట్లో! ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ కారు కోసం ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరమేమీ లేదు. కావాలంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు. కాకపోతే బేసిక్ మోడల్ కారు ధరే రూ.87 లక్షల దాకా ఉంది. అంతే!