ఇండిగో ఎయిర్‌లైన్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వారంలో వరుసగా ఇండిగో సిబ్బంది ప్రయాణీకుల పట్ల చేదు అనుభవాలను రుచిచూపిస్తున్నారు. ప్రయాణీకులపై గౌరవంగా ప్రవర్తించాల్సిన సిబ్బంది ఓవరాక్షన్ చేస్తున్నారు. తాజాగా చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రవర్తనపై ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు.
ఇండిగో ఉద్యోగులు తనపట్ల కూడా దురుసుగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టులోనే ముగ్గురు సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారన్నారు. వారంలోనే రెండుసార్లు ఒకే ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బంది తనపట్ల అమర్యాదగా ప్రవర్తించారని తెలిపారు. వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకే తాను ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించానని చెప్పారు. ఈ ఒక్కసారికి మినహాయింపు ఇచ్చానని తెలిపారు.
ఇటీవల ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల కూడా ఇండిగో ఎయిర్‌లైన్స్ అమర్యాదగా ప్రవర్తించింది. ఆ తర్వాత రాజీవ్ కటియాల్ అనే ప్రయాణికుడిపై ఇండిగో సిబ్బంది పాశవికంగా దాడి చేసింది. అక్టోబర్ 15న ఇండిగో విమానంలో న్యూఢిల్లీకి వెళ్లిన రాజీవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎండ వేడికి తాళలేక ఓ చెట్టు వద్ద నిల్చున్న రాజీవ్‌ను.. నో ఎంట్రీ జోన్‌లో నిల్చున్నట్లు టార్మాక్ సిబ్బంది గుర్తించారు.