దేశంలో వచ్చే యేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇటు ఓటర్లతో పాటు.. అటు మహిళా మణులను ప్రసన్నం చేసుకునే చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా ఉన్న అని పోస్టాఫీసుల్లో రాయితీ ధరకు పప్పు దినులను విక్రయించినట్టు ప్రటించింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 1.54 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. ఈ పోస్టాఫీసుల్లో కంది, మినప, శెనగ పప్పులను సబ్సిడీ ధరలపై అన్ని వర్గాల వారికీ విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రుల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత పండగల సీజన్‌లో పప్పుల ధరలు నింగినంటడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కమిటీ ఇకపై అన్ని పోస్టాఫీసుల్లోనూ పప్పులను సబ్సిడీ ధరలపై అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ‘‘ప్రభుత్వం తరపున ప్రస్తుతానికి ఎలాంటి వ్యాపార సంస్థలూ లేవు. దీంతో వినియోగదారులు అధికమొత్తాలకు పప్పులను కొనాల్సివస్తోంది. ఈ ధరలకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు’’ ఆయన తెలిపారు.