మండిపోతున్న టమోటా ధరలు... కిలో రూ.80 పైమాటే..

సోమవారం, 13 జులై 2020 (15:48 IST)
దేశంలోని పలు కీలక నగరాల్లో టమోటా ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకవైపు టమోటా దిగుబడి తగ్గిపోవడంతో పాటు... వచ్చిన పంట తరలించేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేక మార్కెట్‌లో టమోటా కొరత ఏర్పడింది. దీనికితోడు కరోనా కష్టాలుతోడు కావడంతో టమోటా ధరలు ఆకాశానికి చేరాయి. 
 
ముఖ్యంగా దేశంలోని మెట్రో నగరాల్లో టమోటా ధరలు కనిష్టంగా రూ.50 ఉంటే, గరిష్టంగా రూ.80 వరకు పలుకుతోంది. దేశ రాజధాని హస్తిలో టమోటాల రిటైల్ ధర కిలో రూ.70కి చేరింది. హైదరాబాద్ నగరంలో కూడా కూడా టమోటా ధరలు ఆకాశాన్నంటాయి. సోమవారం కిలో టమోటా రూ.70వరకు పలికింది. చెన్నైలో అయితే, రూ.80 ధర పలుకుతోంది. 
 
ఢిల్లీలోని రిటైల్ మార్కెట్లలో జూన్ ఒకటో తేదీ తర్వాత ప్రతి వారం టమోటా ధర కిలోకు రూ.10 పెరుగుతూ వచ్చాయి. బిగ్‌బాస్కెట్, గ్రోవర్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ పెరుగుదల కనిపించింది. ఆదివారం బిగ్‌బాస్కెట్ టమోటోను కిలోకు రూ.60-66కు విక్రయించింది. గ్రోవర్స్‌లో కిలోకు రూ.53-55 చొప్పున విక్రయించారు. 
 
నాణ్యత ప్రకారం రిటైల్ మార్కెట్లలో టమోటాలు కిలోకు రూ.70 తీసుకొంటున్నారు. హోల్‌సేల్ మార్కెట్లలో పంటలు తక్కువగా రావడం వల్ల గత కొన్ని వారాలుగా టమోటా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు.
 
దక్షిణ భారతదేశంలోని కొన్ని టమోటా పెరుగుతున్న రాష్ట్రాల్లో కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా టమోటా పెంపకం కొన్ని ప్రాంతాల్లో ప్రభావితమైందని వ్యాపారులు తెలిపారు. ఈ సీజను టమోటా సరఫరా తక్కువగా ఉన్నందున ధర పెరిగిందని గత వారం వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. 
 
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, జమ్ముకాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో టమోటా ఉత్పత్తి తక్కువగా ఉన్నది. ఈ రాష్ట్రాలు టమోటా లభ్యత కోసం ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ఆధారపడి ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, దేశం ఏటా 1.973 మిలియన్ టన్నుల టమోటాలను ఉత్పత్తి చేస్తుండగా.. వార్షిక వినియోగం సుమారు 11.51 మిలియన్ టన్నులుగా ఉన్నది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు