ఏటీఎం కేంద్రాలు మూతపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు జమ చేసే నగదు కంటే.. ఏటీఎం కేంద్రాల ద్వారా విత్‌డ్రా చేసే డబ్బు అధికంగా ఉంది. ఫలితంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికితోడు కొన్ని బ్యాంకులు నిర్వహణాభారాన్ని తగ్గించుకునేందుకు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి.
గత 2017లో దేశవ్యాప్తంగా 2,22,300 ఏటీఎం కేంద్రాలు ఉండగా, 2019 నాటికి వీటి సంఖ్య 2,21,703కు పడిపోయింది. నిజానికి 2012 తర్వాత బ్యాంకు ఏటీఎంలు విస్తరణ రేటును పెంచాయి. అప్పట్లో ప్రతి 10,832 మందికి ఒక ఏటీఎం అందుబాటులో ఉంటే 2017 నాటికి ప్రతీ 5,919 మంది ఖాతాదారులకు ఒక ఏటీఎం చొప్పున అందుబాటులోకి వచ్చింది. కానీ, ఐదేళ్ల కాలంలో ఏటీఎం కేంద్రాలు మూతపడటం విచిత్రంగా ఉందని భారత రిజర్వు బ్యాంకు పేర్కొంది. నిజానికి బ్యాంకు యాజమాన్యాలు ఏటీఎంల సంఖ్య పెంచాలని భావించగా, దేశ వ్యాప్తంగా ఇవి తగ్గిపోవడం విచిత్రంగా మారింది.