దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. ఇలాంటి సమయంలో కస్టమర్లకు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గట్టి షాకిచ్చింది. జొమాటో బుకింగ్స్‌పై వసూలు చేసే ఫ్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కసారిగా భారీ పెంచేసింది. దీంతో ఇప్పటివరకు ఫ్లాట్‌ఫామ్ ఫీజును 60 శాతం మేర పెంచినట్టు అయింది. ఈ ప్రకటనతో ఫుడ్ ఆర్డర్ల రేట్లు మరింత పెరగనున్నాయి.
పండగల సీజన్‌లో జొమాటో ఆర్డర్లకు సాధారణంగా డిమాండ్ అధికంగా ఉంటుంది. నిర్వహణ వ్యయాల కోసం ప్లాట్‌పామ్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని జొమాటో తెలిపింది. దీపావళి సందర్భంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతుందని, వినియోగదారులకు చక్కటి సేవలను అందించడానికి పెంచిన ఈ రుసుము సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో తాజా మరోమారు ఈ ఫీజును పెంచేసింది. ఈ యేడాది జనవరి నెలలో కూడా ఫ్లాట్‌ఫామ్ ఛార్జీలను జొమాటో పెంచిన విషయం తెల్సిందే. ఆ సమయంలో రూ.4 ఉండగా రూ.6కు పెంచింది. తాజాగా రూ.6 నుంచి రూ.10కి పెంచింది. ఈ పెంపు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ధరను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఆర్డరుపై రూ.10 ప్లాట్‌ఫామ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
కాగా జొమాటో ఫ్లాట్‌పామ్ ఫీజు క్రమక్రమంగా పెరుగుతోంది. క్రమం తప్పకుండా అనేక సార్లు కంపెనీ పెంచింది. ఆరంభంలో రూ.1గా ఉండగా దానిని రూ.2కి, ఆపై రూ.3కి పెంచింది. 2023లో రూ.3 నుంచి రూ.4కి పెంచింది. ఆ తర్వాత క్రమంగా రూ.6కి పెరిగింది. దీపావళి నేపథ్యంలో పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ తాజాగా రూ.10కి పెంచింది.