జర్నలిస్టు వృత్తికి భాషపై నైపుణ్యం అవసరం... డాక్టర్ విజయలక్ష్మి

బుధవారం, 26 సెప్టెంబరు 2012 (20:32 IST)
WD
రాజధాని కళాశాల పీజీ, తెలుగు పరిశోధనశాఖ ఆధ్వర్యంలో రెండవరోజు సదస్సు జరిగింది. ఈ సదస్సులో "జర్నలిజం-అధ్యాయనావశ్యకత" అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ పలు సూచనలు చేశారు. జర్నలిస్టుగా రాణించాలంటే అన్ని రంగాల్లో నైపుణ్యం అవసరమని తెలిపారు.

పాఠకుడికి అర్థమయ్యే విధంగా వార్తలను అందించాలనీ, మూలభాష అంటే ముఖ్యంగా ఈరోజుల్లో ఆంగ్లంపై మరింత పట్టు సాధించి తెలుగు భాషలోకి అనువదించగలిగే సామర్థ్యం ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. జర్నలిస్టుకు సాంకేతిక పరిజ్ఞానం, సునిశిత జ్ఞానం, కొత్తగా ఆలోచించే ధోరణి అవసరమన్నారు, క్రమశిక్షణ తప్పనిసరని ఆయన తెలిపారు.

అంతకుముందు పచ్చయప్ప కళాశాల హిందీ శాఖ నుంచి పదవీ విరమణ పొందిన డాక్టర్ వైవీఎస్ఎన్. మూర్తి, తెలుగు అనువాదాలు అనే అంశంపై మాట్లాడుతూ అనువాదానికి మూలం భాషపై నైపుణ్యమే అని చెప్పారు. లక్ష్య భాషపై ప్రావీణ్యత అవసరమనీ, అనువాదం తెలుగు రచన అనే అభిప్రాయం కలుగజేసినప్పుడే ఆ అనువాద ప్రక్రియ విజయవంతమవుతుందని తెలిపారు.

జానపద సాహిత్యం- అధ్యయన విలువలు అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విస్తాలి శంకర్రావు ప్రసంగిస్తూ జానపద గేయాలు మనస్సుకి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. 'అదేంటి మామా ' అనే జానపద గేయాన్ని భావయుక్తంగా గానం చేసారు. సంప్రదాయాన్ని పాటించే వారంతా జానపదులేనని అన్నారు.

"ఇంటర్‌నెట్ - వెబ్ జర్నలిజం" అనే అంశంపై వెబ్‌దునియా తెలుగు అసిస్టెంట్ ఎడిటర్ ఇమ్మడిశెట్టి వేంకటేశ్వరరావు ప్రసంగిస్తూ ఇంటర్‌నెట్ జీవితంలో ఒక భాగమైందని అన్నారు. ప్రాచీనులు భాషను సంస్కరిస్తే. ఆధునిక కాలంలో భాషను సంహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాషతో పాటు గ్రాంథికం, సరళం, జానపద శైలిలో పట్టు ముఖ్యమని స్పష్టం చేశారు. భాషపై నైపుణ్యాన్ని సాధిస్తే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు.

ఈ సదస్సుకు నగర ప్రముఖులులైన ఈఎస్‌రెడ్డి, గుడిమెట్ల చెన్నయ్య, లయన్ డి నాగరాజు, డాక్టర్ శంకర్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజధాని కళాశాల తెలుగు శాఖాధ్యక్షురాలు డాక్టర్ మానికొండ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. డాక్టర్ ఎస్. ఎలిజబెత్ జయకుమారి స్వాగత వచనాలు పలుకగా, డాక్టర్ ఎ. అంబ్రుణి ప్రార్థన గీతాన్ని గానం చేసి చివరిలో వందన సమర్పణ చేశారు.

వెబ్దునియా పై చదవండి