యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2024 : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఠాగూర్

గురువారం, 15 ఫిబ్రవరి 2024 (11:50 IST)
దేశంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు సేవలు అందించాలని భావించే యువత కోసం ప్రతి యేటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులోభాగంగా, ఈ యేడాది ఈ నోటిఫికేషన్ విడుదలైంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2024ను విడుదల చేయగా, దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 14వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ పరీక్షకు హాజరుకావాలని భావించే ఔత్సాహిక అభ్యర్థుు వచ్చే నెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్స్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 
 
కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యాసంస్థల్లో డిగ్రీ లేదా సమానమైన కోర్సు పూర్తి చేసినవారు దరఖాస్తుకు అర్హులు అవుతారు. జనరల్ అభ్యర్థులు గరిష్ఠంగా ఆరుసార్లు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాయొచ్చు. అయితే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, వికలాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఆశావహులు అపరిమిత సంఖ్యలో ప్రయత్నించవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు ప్రయత్నించవచ్చు. వికలాంగ కేటగిరికి చెందిన జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు గరిష్ఠంగా 9 సార్లు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి ప్రిలిమినరీ పరీక్షలో ఏదైనా ఒక పేపర్ పరీక్ష రాస్తే ఒక ప్రయత్నం చేసినట్టుగా పరిగణిస్తారు.
 
వయసు విషయానికి వస్తే కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. ఇక ఆగస్టు 1, 2023 నాటికి వయసు 32 సంవత్సరాలు నిండినవారు అర్హులు కాదు. అంటే ఆగస్టు 1, 2023 నాటికి 32 సంవత్సరాలు దాటకూడదని యూపీఎస్సీ నిబంధనలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే అభ్యర్థులు ఆగస్టు 2, 1991 కంటే ముందు.. ఆగష్టు 1, 2002 తర్వాత జన్మించి ఉండకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, కేటగిరీలను బట్టి మరికొందరికి సడలింపు ఉంటాయి. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసు కోసం ప్రయత్నించే అభ్యర్థులు కచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు