ఏపీ ట్రిపుల్ ఐటి అడ్మిషన్ లిస్ట్ రద్దు

మూడు ఏపీ ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియలో ప్రోగ్రామింగ్ తప్పిదాలు దొర్లడంతో లిస్ట్‌ను రద్దు చేశారు. మూడు ట్రిపుల్ ఐటీలకు విద్యార్థులను ఎంపిక చేస్తూ ఈ నెల ఒకటో తేదీన విడుదలైన జాబితాను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) చాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు.

ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాలో కొన్ని పారపాట్లు, అవకతవకలు జరిగాయని తెలియడంతో ఈ జాబితాను రద్దు చేశామన్నారు. రిజర్వేషన్ల అమలు, మండలాలకు సీట్ల కేటాయింపుల్లో తప్పిదాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్‌కె వ్యాలీ, బాసర, న్యూజివీడు ట్రిపుల్ ఐటీల్లోని మొత్తం ఆరు వేల సీట్లకు 5100 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.

రాష్ట్రస్థాయిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మిగిలిన 900 సీట్లను అందిస్తారు. సెప్టెంబరు 6 నుంచి ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభం కానున్నాయి. కొత్త జాబితాను మరో పది రోజుల్లో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఎంపికయిన విద్యార్థులకు కాల్‌లెటర్లు పంపుతామన్నారు. ప్రోగ్రామింగ్‌లో లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని రాజిరెడ్డి వివరించారు.

వెబ్దునియా పై చదవండి