ఇక తెలుగులోనే ఇంజనీరింగ్ కోర్సులు

గురువారం, 8 జులై 2021 (11:48 IST)
ప్రస్తుతం మన దేశంలో ఇంజనీరింగ్ కోర్సులు ఇంగ్లీషులోనే కొనసాగుతున్నాయి. అయితే, ఆయా మాతృభాషల్లో చదువుకోవాలనే వారికి ఇప్పటివరకు ఈ అవకాశం లేదు. కానీ, ఇపుడు అలాంటి అవకాశం రానుంది. 
 
సాధారణంగా ఇంజనీరింగ్ చేయాలనుకున్న వారెవరైనా తప్పనిసరిగా ఇంగ్లిష్ మీడియంలోనే ఆ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్ వరకు వారి వారి మాతృభాషల్లో చదువుకున్న వారు కూడా ఇంజనీరింగ్ ఇంగ్లిషులోనే చదవాల్సి ఉంటుంది. అయితే దీని మూలంగా అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. 
 
అప్పటిదాక మాతృభాషలో చదువుకుని ఇంజనీరింగులో ఇంగ్లిష్ అర్థం కాక అవస్థలు పడుతుంటారు. అయితే ఇక నుంచి ఆ బాధలు తీరినట్టే. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) ఇంజనీరింగ్ కాలేజీల్లో 8 ప్రాంతీయ భాషల్లో కోర్సులకు అనుమతి ఇచ్చింది. 
 
అయితే ఈ ప్రాంతీయ భాషల్లో తెలుగు కూడా ఉంది. 2021-22 నుంచి ఈ కోర్సులు ప్రారంభంకానున్నాయి. హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, గుజరాతి, కన్నడ, మలయాళం భాషల్లో ఇక నుంచి ఇంజనీరింగ్ కోర్సులు ఉండనున్నాయి.
 
మాతృభాషల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం ఇవ్వాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 సూచించిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యాలో మాతృభాషకు ప్రాధాన్యం ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయం అమలులోకి రానుంది. 
 
ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మాతృభాషల్లో ఉన్నత విద్యను బోధించడం వల్ల వారికి బేసిక్స్ బాగా అర్థం అవుతాయని అధికారులు చెబుతున్నారు.
 
అయితే, ప్రస్తుతానికి యూజీ ఇంజనీరింగ్‌లోని మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇతర కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించే అవకాశాన్ని ఏఐసీటీఈ కల్పించింది. ఈ ప్రాంతీయ భాషల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించే కాలేజీలు ఖచ్చితంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిషన్(NBA) కలిగి ఉండాలి. 
 
ఒక్కో విభాగంలో కేవలం 30-60 మంది విద్యార్థులతోనే కోర్సు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే మాతృభాషలో బోధించేందుకు దేశ వ్యాప్తంగా 500 కాలేజీలు ఏఐసీటీఈ(AICTE)కి దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 కాలేజీలు కూడా ఉండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు