సినిమా హాళ్ళ‌ను కాపాడండి - ఓటీటీకి వెళ్ళ‌కండి

బుధవారం, 7 జులై 2021 (16:48 IST)
Telagana chamber meet
సినిమా హాళ్ళ‌ను కాపాడండి - ఓటీటీకి వెళ్ళ‌కండి అంటూ ప్ల‌కార్డ్‌ల‌తో బుధ‌వారంనాడు హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ నినాదాల‌తో హోరెత్తింది. ఈరోజు ముందుగా అనుకున్న‌ట్లుగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి స‌మావేశ వివ‌రాల‌ను విలేక‌రుల‌కు వివ‌రించారు.
 
గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండాలని, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానించినట్టు సునీల్ నారంగ్ తెలిపారు. అగ్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపడం బాధాకరమని అన్నారు. తాను కూడా ఓ నిర్మాతనేనని, అయితే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరంగా ఉన్న ఈ సమయంలో నిర్మాతలు సైతం సంయమనం పాటించాలని, ఎగ్జిబిటర్స్ కష్టాలను గుర్తించాలని కోరారు.
 
రెండుచోట్ల 1700 థియేట‌ర్లు
తెలంగాణలో 600, ఆంధ్రప్రదేశ్‌లో 1100 థియేటర్లు ఉన్నాయని, మొన్నటి వరకూ ఆ థియేటర్ల నుండి ఆదాయాన్ని పొందిన నిర్మాతలు ఇప్పుడు కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో ఓటీటీ దారి పట్టడం కరెక్ట్ కాదని విజయేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంచి క్వాలిటీ సౌండ్ తో, సౌకర్యవంతంగా సినిమాలను థియేటర్లలో చూస్తే లభించే తృప్తి వేరని, అది ఓటీటీలో చూడటం వల్ల దక్కదని, అందువల్లే ఇటీవల ఓటీటీలో వచ్చిన పెద్ద చిత్రాలకు ఆదరణ కరువైందని ఆయన అభిప్రాయ పడ్డారు. 
 
తీవ్రంగా కానున్న నిర్ణ‌యాలు
థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత ఓటీటీలోనూ, శాటిలైట్ ఛానెల్స్ లోనూ ప్రసారం చేసుకుంటే నిర్మాతకే అదనపు లాభాలు దక్కుతాయి., వాటిని కాదని ఓటీటీకి వెళితే రాబోయే రోజుల్లో తమ నిర్ణయాలు సైతం తీవ్రంగా ఉండే ఆస్కారముందని కొందరు సభ్యులు సుతిమెత్తగా హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు