స్త్రీపురుషుల మధ్య తారతమ్య లేకుండా చేసేది విద్య : జస్టిస్ అనితా సుమంత్
ఆదివారం, 9 డిశెంబరు 2018 (17:15 IST)
స్త్రీపురుషుల మధ్య ఉన్న తారతమ్యాన్ని చెరిపేసేది కేవలం విద్య ఒక్కటేనని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనితా సుమంత్ అన్నారు. అలాగే, విద్యార్థులు శ్రమించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు.
చెన్నై నగరంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఎస్ఆర్ఎం గ్రూపు విద్యా సంస్థలకు చెందిన ఎస్ఆర్ఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ 22వ స్నాతకోత్సవ వేడుకలు ఆ గ్రూపు సంస్థల వ్యవస్థాక ఛైర్మన్ డాక్టర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షతన డాక్టర్ టీపీ గణేశన్ ఆడిటోరియంలో తాజాగా జరిగాయి. ఈ వేడుకలకు జస్టిస్ అనితా సుమంత్ ముఖ్య అతిథిగా హాజరై 560 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తమ జీవితంలో మూడు ముఖ్య విషయాలను అలవర్చుకోవాలని సూచించారు. హానెస్ట్, హై ఇమాజిన్, హార్డ్‌వర్క్‌లతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా, కాలేజీ నుంచి బయటకు వెళ్లి ఏదేని ఉద్యోగంలో చేరినట్టయితే ఆ కంపెనీకి నిజాయితీగా ఉంటూ సేవ చేయడం ఎంతో ముఖ్యమన్నారు. అలాగే, ఉన్నత విలువలు కలిగివుండి విశాలదృక్పథంతో పని చేయాలన్నారు.
కాగా, ఈ స్నాతకోత్సవంలో మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోటల్, కేటరింగ్ మేనేజ్‌మెంట్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న కేఆర్ జైకుమార్‌కు బంగారు పతకాన్ని జస్టిస్ అనితా సుమంత్ ప్రదానం చేశారు.
అంతకుముందు ఎస్ఆర్ఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సుబ్బురాం వార్షిక నివేదికను వెల్లడించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో 50 లోపు ర్యాంకులను సాధించిన వారిలో తమ కాలేజీకి చెందిన 85 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు.
అలాగే, 2017-18 విద్యా సంవత్సరంలో 107 మంది విద్యార్థులకు ఫీజు రాయితీ ఇవ్వగా, 57 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ స్నాతకోత్సవంలో పీజీ, యూజీ కోర్సులకు చెందిన 560 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను పుచ్చుకున్నారు.