2015 లోపే అంతరిక్షంలోకి భారతీయులు...!

గురువారం, 23 అక్టోబరు 2008 (03:20 IST)
చంద్రయాన్- 1 ప్రయోగం అద్భుతంగా విజయం సాధించిన నేపథ్యంలో చంద్రుని మీదికి మనిషిని పంపే సంక్లిష్టమైన, బృహత్తరమైన, ఘనతర కార్యాన్ని మరో ఏడేళ్ల లోపే పూర్తి చేయగలమని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. 2015 నాటికే మానవ సహిత ఉపగ్రహాన్ని చంద్రుని మీదకు పంపుతామని ఇస్రో పేర్కొంది.
అనంత విద్యుత్తుకు మార్గం...
  భూమ్మీద అరుదుగా లభించే హీలియం-3 మూలకం చంద్రుడిపై 50 లక్షల టన్నులు ఉందని అంచనా.. దీంతో మొత్తం ప్రపంచ విద్యుత్ అవసరాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 వేల సంవత్సరాలు నిరాఘాటంగా తీర్చుకోవచ్చు. చంద్రుడిపైకి మనిషి యాత్రకు మూలం ఇదే మరి...      


వందకోట్ల మందికి పైగా భారతీయుల హర్షాతిరేకాల మధ్య శ్రీహరికోటనుంచి బుధవారం ఉదయం చంద్రయాన్- 1 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ విలేఖరులతో మాట్లాడారు.

ఈ రోజు ప్రయోగం తర్వాత తాము కాస్త ఊపిరి పీల్చుకుంటున్నామని నాయర్ చెప్పారు. ఇకపై ఇద్దరు రోదసీ యాత్రికులను జిఎస్ఎల్‌వి రాకెట్ సాయంతో మోసుకెళ్లే క్యాప్సూల్‌ను ఎలా తయారు చేయాలనే దానిపై తాము దృష్టి సారించవలసి ఉందని అన్నారు.

నిజంగా ఇది అతి సంక్లిష్టమైన, సవాలుతో కూడిన చర్యగా నాయర్ అభివర్ణించారు. అంతరిక్షంలో మనిషి జీవన స్థితిని అంచనా వేసే మోడ్యూల్‌ను రూపొందించడం చాలా కష్టమైన పనిగా పేర్కొన్నారు. టెక్నాలజీ పరంగా, వాస్తవాలను గుర్తించేపరంగా ఇది తమకు పెనుసవాలు లాంటిదని నాయర్ చెప్పారు. పైగా, అంతరిక్ష యాత్రికులను ఎంచుకోవడం, రోదసీ యాత్రకు వారికి శిక్షణ గరపటం, ప్రయోగ వ్యవస్థ యొక్క్ విశ్వసనీయతను మెరుగుపర్చడం అనేవి చాలా సంక్లిష్ట సమస్యలని తెలిపారు.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తాము ఇప్పటికే ఒక ప్రాజెక్టు నివేదికను తయారు చేశామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. స్పేస్ కమిషన్ ఇప్పటికే దీనికి ఆమోదం తెలిపిందని. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. దీనిపై ఆధారపడి భారత గడ్డనుంచి చంద్రుడి పైకి మానవ సహిత ఉపగ్రహ ప్రయోగాన్ని 2015 లోగా పూర్తి చేస్తామని చెప్పారు.

మానవ ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలో సరికొత్త లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయవలసి ఉంటుందని, వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన కేంద్రాన్ని బెంగుళూరులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీహరికోటలో ఏర్పాటు చేయతలపెట్టిన మూడో లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి రూ.600 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

మనిషిని భూమికి దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం, తిరిగి క్షేమంగా భూమికి చేర్చడం ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదని నాయర్ తెలిపారు. సాంకేతికపరమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు.

చంద్రయాన్ ప్రయోగం తర్వాత ఇస్రో తదుపరి సహజ గమ్యం అరుణగ్రహమే -మార్స్- నని నాయర్ ప్రకటించారు. శాస్త్ర ప్రపంచం నుంచి దీనికి ప్రతిపాదనల కోసం తాము ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపాదనలు రాగానే అంగారక గ్రహ యాత్రకు పథకాన్ని తాము ఖరారు చేయగలమని మాధవన్ నాయర్ తెలిపారు. అంగారక గ్రహానికి అంతరిక్ష నౌకను తీసుకుపోయే సామర్థ్యం జీఎస్ఎల్‌వి ఉపగ్రహానికి ఉందని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి