కీలకమైన అంతరిక్ష శక్తిగా భారత్ ఆవిర్భావం

Raju

ఆదివారం, 16 నవంబరు 2008 (03:26 IST)
చంద్రుడిపై జాతీయపతాకాన్ని విజయపంతంగా ప్రతిష్టించిన భారత్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రలో నిలిచిపోయింది. 36 సంవత్సరాల క్రితం స్థాపించబడిన భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇప్పుడు అమెరికా, ఫ్రెంచ్, రష్యన్ అంతరిక్ష సంస్థల సరసన సగర్వంగా నిలబడింది. అంతరిక్షంలో ఏదైనా సాధించగల ప్రతిభా సామర్థ్యాలను ఇస్రో ఇప్పుడు నిజంగానే తన సొంతం చేసుకుంది.

ఇస్రో ఇప్పటికే పలు ప్రపంచ రికార్డులను కలిగిఉందనే విషయం చాలా తక్కువమందికే తెలుసు. వాణిజ్య కార్యకలాపాలకు ఇతరదేశాల ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యాన్ని ఇస్రో సంతరించుకుంది. భారత్ తాజాగా తలపెట్టిన చంద్రయాన్ అయితే దేశ కీర్తి ప్రతిష్టలను వినువీధుల్లో నిలిపింది.

జంబో జెట్ వేగానికి పది రెట్ల వేగంతో అంటే గంటకు ఆరువేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలం మీదికి దూసుకుపోయిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై తీసిన తొలిచిత్రాలు అద్భుతమైన స్పష్టతతో ఉంటున్నాయి. ఆత్మాహుతి చర్యను తలిపిస్తూ మెరుపు వేగంతో దూసుకొచ్చి ఉపరితలాన్ని ఢీకొంటున్న సమయంలో ఫోటోలు తీయడం అంటే మాటలు కాదు మరి.

చంద్రయాన్ ప్రయోగం మరిన్ని ప్రధమ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. చంద్రుడి మీదికి మరే ఉపగ్రహమూ తీసుకోనన్ని అతిపెద్ద పరికరాలను చంద్రయాన్ తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహంలోని మొత్తం పరికరాల సంఖ్య 14. కేవలం 386 కోట్ల ఖర్చుతో 21వ శతాబ్దిలో అత్యంత స్వల్ప వ్యయంతో ముగిసిన చంద్రయాన ప్రయోగంగా కూడా ఇది రికార్డు సృష్టించింది.

ఈ ప్రయోగంలో 14 దేశాలు అంతర్జాతీయ భాగస్వాములుగా చేరాయి. ఒకే ప్రయోగంలో చంద్ర కక్ష్యకు చేరటం, చంద్రుడి ఉపరితలంపైకి దిగటం అనే కీలక చర్యలను ఇంతకు ముందు ఏ దేశం కూడా తొలి ప్రయత్నంలోనే ఇంత విజయవంతంగా నిర్వహించిన చరిత్ర కూడా లేదు మరి.

అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు తాము సాధించినదానికి పులకించిపోతున్నారంటే దానికి కారణం ఉంది మరి. ప్రపంచం మొత్తం ఈరోజు ఇస్రో ఘనతను కొనియాడుతోంది. ఇది నిజంగా ప్రపంచ రికార్డేనని, ప్రపంచంలో ఏ దేశం కూడా తన మొట్టమొదటి ప్రయత్నంలో ఒకే ఉపగ్రహంలో ఇన్ని ప్రయోగ పరికరాలను మోసుకెళ్లిన చరిత్ర గతంలో లేదని అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసాలో ప్రాజెక్టు ఇంజనీర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అలోక్ చటర్జీ పేర్కొన్నారు.

తన రాకెట్ మరియు ఉపగ్రహ సామర్థ్యాలకు సంబంధించి కూడా ఇస్రో పలు ప్రపంచ రికార్డులను సాధించింది. ఒకే ప్రయత్నంలో పది ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 2008 ఏప్రిల్‌లో ఇస్రో ప్రపంచ రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 9 పౌర రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు కలిగిన దేశంగా భారత్ ఈ రోజు రికార్డు సృష్టించింది. 11 కమ్యూనికేషన్ మరియు వాతావరణ ఉపగ్రహాలను కలిగివున్న భారత్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అగ్రగామిగా నిలబడింది.

పైగా ఆరంభించిన మొట్టమొదటి ఎత్తులోనే చంద్రయాన్ ప్రయోగాన్ని, చంద్రుడి ఉపరితలంపై ప్రోబ్‌ని ఢీకొట్టించడాన్ని విజయవంతంగా ముగించిన ఏకైక దేశంగా భారత్‌ ఘనత సాధించింది. స్వల్ప కాలంలో, అత్యంత స్వల్ప వ్యయంతో చంద్రయాన్ ఉపగ్రహాన్ని రూపొందించి సమర్థవంతంగా ప్రయోగాన్ని ముగించిన ఇస్రో నిజానికి భారత్ ఏం చేయగలదో నిరూపించే ఉజ్వల ఉదాహరణగా వెలుగొందుతోంది.

అంతరిక్ష అన్వేషణలలో భారత్ ఈరోజు వాస్తవంగానే బలీయమైన శక్తిగా అవతరించింది. ఇస్రో ఈ రోజు సాధించిన విజయం రేపు మరో పెద్ద ముందంజకు దారితీసి... అంగారక గ్రహానికి, ఆపై దూరాలకు కూడా భారత్ ఉపగ్రహాలను పంపించగల పరిణామానికి బాటలేస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు మరి.

భారత్.. కాదు కాదు.. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్... ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు మరింత ఉజ్వలంగా ప్రకాశిస్తోంది.

థాంక్యూ ఇస్రో..

వెబ్దునియా పై చదవండి