చంద్రయాన్-1: కౌంట్‌డౌన్ ప్రారంభం

చంద్రునిపై భారత్ ఆధిపత్యాన్ని చాటేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్‌థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) కేంద్రం నుంచి నిర్వహించతలబెట్టిన ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ సోమవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 22వ తేది బుధవారం చంద్రయాన్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది.

భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రయోగంలో శ్రీహరికోట నుంచి దూసుకెళ్లనున్న ఉపగ్రహం ద్వారా 11 ఫేలోడ్స్ (శాస్త్రీయ పరికరాలు)ను అంతరిక్షంలోకి పంపనున్నారు. షార్ కేంద్రం అందించిన వివరాల ప్రకారం ఈ ఉపగ్రహం బరువు 1,380 కిలోలుగా ఉండడం విశేషం.

చంద్రుని వద్దకు వెళ్లనున్న ఈ చంద్రయాన్-1 ఉపగ్రహం చంద్రుని నుంచి నూరు కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత కక్షలో తిరుగుతూ చంద్రుని ఉపరితలాన్ని వివిధ కోణాల్లో ఫోటోలు తీయనుంది. తద్వారా చంద్రుని మీద ఉన్న మట్టి అవశేషాలను పరిశీలించడానికి వీలు కలుగనుంది.

చంద్రయాన్-1 ఉపగ్రహం ద్వారా వెళ్లనున్న 11 పరికరాల్లోని ఓ పరికరం భవిష్యత్‌లో చంద్రుని ఉపరితలంపై దిగేందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తుంది. తొలిసారిగా ఇతరగ్రహ పరిశోధనకు ఉపక్రమించిన భారత్ చంద్రునిపై ప్రయోగాల కోసం ఉద్ధేశించిన ఈ చంద్రయాన్ ప్రాజెక్ట్ కోసం రూ. 386 కోట్లను ఖర్చు చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి