చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం

WD
యావద్భారతావని ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న క్షణం రానేవచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ సీ11 రాకెట్ బుధవారం ఉదయం సరిగ్గా 6,22 గంటల సమయంలో నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లింది. దశాబ్ద కాలం పైగా భారత అంతరిక్ష శాస్త్రజ్ఞులు కన్న కలలను సాకారం చేస్తూ చంద్రయాన్ -1 యాత్ర తన ప్రయోగదశను అత్యంత విజయవంతంగా దాటుకుని పీఎస్ఎల్‌వీ సీ11 రాకెట్‌తో నింగికి దూసుకెళ్లింది.

భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సరిగ్గా 6 గంటల 22 నిమిషాలకు శ్రీహరి కోటనుంచి ప్రయోగించబడిన పీఎస్ఎల్‌వీ సీ11 రాకెట్‌ క్షణకాలంలోనే మేఘాలు ఆవరించిన ఆకాశంలోకి దూసుకుపోయింది. భూమి నుంచి 3,84,000 కిలోమీటర్ల దూరంలోని చంద్రుడి మీదకు ఇస్రో ప్రయోగించిన ఈ ఉప్రగ్రహం తొలి మూడు దశలను అవలీలగా ముగించి అనంత గగనంలో విహారయాత్ర మొదలెట్టింది.

ఉపగ్రహాన్ని మోసుకు వెళ్లే బూస్టర్ రాకెట్ తొలిదశలో 58 సెకనులలో పేలి ఉపగ్రహాన్ని రెండో స్టేజికి పంపింది. తర్వాత 266 సెకండ్లలో రెండో బూస్టర్ ఉపగ్రహం నుంచి విడివడింది. తర్వాత 540 సెకనుల వ్యవధిలో మూడో బూస్టర్ కూడా నిర్విఘ్నంగా విడివడి ఉపగ్రహాన్ని నాలుగో దశకు నెట్టింది.

శ్రీహరికోట గగనతలం దట్టమైన మేఘాలతో ఆవరించుకుని ఉన్నందున బూస్టర్ రాకెట్ పేలిన రెండు సెకనులలోనే దాని గమనం ఏమిటన్నది తెలీకుండా గగనంలో మాయవవడంతో శ్రీహరి కోట కంట్రోల్ రూమ్‌లోంచే కంప్యూటర్ యానిమేషన్ పిఎస్ఎల్‌వి రాకెట్ గమనాన్ని, బూస్టర్ రాకెట్ సెపరేషన్ తీరుతెన్నులను చూపిస్తూ వచ్చింది.

చంద్రునిపై మానవరహిత ఉపగ్రహం పంపాలన్ని భారత్ శాస్త్రజ్ఞుల కల ఈ బుధవారం ఉదయం వంద కోట్లమంది భారతీయుల ఆశల సాక్షిగా సాకారమైంది. మొత్తం మీద అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా, జపాన్‌ల తర్వాత చంద్రునిపై మానవరహిత ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టిన ఆరో దేశంగా భారత్ నిలిచింది. శ్రీహరి కోట నుంచి బయలుదేరిన ఈ ఉపగ్రహం.. నిప్పులు చిమ్ముతూ ప్రచండ వేగంతో... అతి పెద్ద ధ్వనిని చేస్తూ నింగిలోకి ప్రవేశించింది.

18.2 నిమిషాల తర్వాత చంద్రయాన్-1 ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది చాలా సాధారణంగా.. జరిగిపోయిందని.. ఎలాంటి అవరోధాలు లేకుండా.. ప్రయోగం విజయవంతం చేసి భారత్ కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో ఛైర్మన్ జి. మాధవన్ నాయర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ప్రయోగం విజయవంతం చేసినందుకు శాస్త్రవేత్తల బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ సీ11) 44 మీటర్ల పొడవు.. 316 టన్నుల బరువు ఉన్నది.

భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీలు... చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఇది ఒక చారిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుందని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి