చంద్రయాన్-2 డిజైన్ పూర్తి: 2012లో ప్రయోగం

బుధవారం, 24 డిశెంబరు 2008 (17:58 IST)
చంద్రయాన్-2 ఉపగ్రహం డిజైన్ పని పూర్తయిందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. దీన్ని 2012లో పూర్తి ప్రయోగించనున్నామని తెలిపింది.
చంద్రయాన్-1 ప్రాజెక్టును దిగ్విజయంగా నిర్వహించిన బృందాన్ని సత్కరించడానికి భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ, న్యూఢిల్లీలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హాజరైన ఇస్రో ఛైర్మన్ జి మాధవన్ విలేఖరులతో ముచ్చటించారు.


ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 ఉపగ్రహ రూపకల్పనను పూర్తి చేశారని నాయర్ ప్రకటించారు. 2012 నాటికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రయోగించనున్నామని చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 2, చిన్న రోవర్‌ను దింపి, నమూనాలను సేకరించి అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు.

ఇస్రో ఇటీవలే మరో విజయాన్ని సాధించిందని నాయర్ ఈ సందర్భంగా తెలియజేశారు. యూరోపియన్ శాటిలైట్ ఆపరేటర్ యూటెలిశాట్ కోసం ఇస్రో ఇటీవలే ఒక వాణిజ్య ఉపగ్రహాన్ని నిర్మించి ఇచ్చిందని, దీన్ని ఈ మధ్యే దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి విజయవంతంగా ప్రయోగించారని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు.

తన వాణిజ్య విభాగం ద్వారా ఇస్రో ఏటా వెయ్యి కోట్ల రూపాయలను ఆర్జిస్తోందని నాయర్ చెప్పారు. ఈ సంవత్సరం వాణిజ్యపరంగా 20 శాతం వృద్ధి సాధించగలమని తెలిపారు.