చంద్రయాన్ పనితీరు చక్కగానే ఉంది: ఇస్రో

బుధవారం, 26 నవంబరు 2008 (23:28 IST)
చంద్రుడి వైపుగా మొట్టమొదటి భారతీయ మానవ రహిత వాహకనౌక చంద్రయాన్-1 సజావుగా పనిచేస్తున్నదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పేర్కొంది. చంద్రుడి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పటికీ చంద్రయాన్ సాధారణ స్థితిలోనే పనిచేస్తోందని ఇస్రో అధికారులు చెప్పారు.

ప్రస్తుతం చంద్రుడిపై వేసవికాలం నడుస్తోంది కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుతోందని, అయితే ఇందుకు భయపడవలసిన పనిలేదని ఇస్రో ప్రతినిధి సతీష్ పేర్కొన్నారు. చంద్రుడిపై వాతావరణం డిసెంబర్ నాటికి సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు.

చంద్రయాన్‌లోని 11 పేలోడ్లలో 9 పేలోడ్లను ఇప్పటికీ స్విచ్ ఆన్ చేసి ఉన్నామని, అవి సరిగానే పనిచేస్తూ, డేటాను భూమికి పంపుతున్నాయని సతీష్ తెలిపారు. చంద్రుడిపై వాతావరణం వేడెక్కిన సందర్భంగా ఇస్రో అన్ని పేలోడ్లను ఒకేసారి పనిచేయించడం లేదని పేర్కొన్నారు. చంద్రుడిపై పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా పేలోడ్లు దెబ్బతినకూడదని తాము భావిస్తున్నామని అన్నారు.

మొత్తం 11 పేలోడ్లలో సారా, హెక్స్ అనే పేర్లు గల పేలోడ్లు చాలా సున్నితమైన పరికరాలు కాబట్టి వాటిని పనిచేయకుండా నిలిపివేశామని సతీష్ చెప్పారు. డిసెంబర్ తొలి వారం నాటికి చంద్రుడిపై వాతావరణం మామూలు స్థితికి వస్తుందని వివరించారు.

వెబ్దునియా పై చదవండి