చంద్రుని కక్షలోకి చంద్రయాన్-1 : ప్రయోగం సక్సెస్

శనివారం, 8 నవంబరు 2008 (22:12 IST)
భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-1 ప్రయోగం పూర్తి విజయవంతమైంది. గత నెల 22న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగసిన చంద్రయాన్-1 ఉపగ్రహం శనివారం కీలకదశను విజయవంతంగా పూర్తి చేసింది.

షార్ అధికారుల వివరాల ప్రకారం భూమి నుంచి చంద్రుని వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన చంద్రయాన్-1 ఉపగ్రహం 18 రోజుల తర్వాత శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్ణీత కక్షలోకి ప్రవేశించడం ద్వారా ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతం అయ్యింది. ఇలా చంద్రుని కక్షలో ప్రవేశించిన చంద్రయాన్-1 ఉపగ్రహం దాదాపు రెండేళ్లపాటు తన కార్యక్రమాలు నిర్వహించనుందని వారు పేర్కొన్నారు.

చంద్రుని నుంచి 100 కిలో మీటర్ల దూరంలో చంద్రయాన్-1 ఉపగ్రహం పరిభ్రమించే సమయంలో ఇందులోని వివిధ రకాల పరికరాలు చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించడం, ఫోటోలు తీయడం, వాటిని భూమికి పంపించడం లాంటి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

ఇలా చంద్రయాన్-1 ఉపగ్రహం చంద్రుని గురించి సేకరించే సమాచారంతో భవిష్యత్‌లో ఆ గ్రహంపై భారతీయులు కాలుమోపడంతో పాటు అక్కడి పరిస్థితులను గురించి పూర్తిగా అవగాహన చేసుకునేందుకు వీలుకల్గుతుంది.

వెబ్దునియా పై చదవండి