చంద్రుని తర్వాత 'ఆదిత్యు'నిపై ఇస్రో దృష్టి

FileFILE
చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతంగా ప్రయోగించిన తర్వాత భారత శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసం పొంగి పొరులుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి నిదర్శనంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యునిపై దృష్టి పెట్టడమే. 'ఆదిత్య' పేరుతో సూర్య ఉపగ్రహాన్ని త్వరలోనే ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

బెంగుళూరులో ఇస్రో ఛైర్మన్ జి మాధవన్ నాయర్ మాట్లాడుతూ చంద్రయాన్-1 ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తల్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపారు. అందుకే తమ శాస్త్రవేత్తలు సూర్య ప్రయాణానికి సిద్ధం అవుతున్నారని వివరించారు. ఈ ప్రయోగానికి ఇప్పటికే అనుమతి లభించిందని.. ఇక దీనికి సంబంధించిన కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

భారత అంతరిక్ష పరిశోధనలకు, వేగవంతమైన గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడే ఫాస్ట్ ట్రాక్ శాటిలైట్‌ను ఇస్రో వృద్ధి చేస్తున్నట్లు నాయర్ వివరించారు. ఏడాదిన్నరలోపు దీనికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. కాగా, చంద్రునిపైకి అక్టోబర్ 11న చంద్రయాన్-1 (పీఎస్ఎల్‌వీ-సి11) ఉపగ్రహాన్ని ప్రయోగించి భారత కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం విదితమే.

దీంతో రష్యా, అమెరికా, జపాన్, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తర్వాత ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన దేశంగా భారత్ నిలిచింది. భారత్ ప్రయోగించిన ఈ చంద్రయాన్-1 ఇటీవలే చంద్రునికి అత్యంత సమీపంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. పూర్తి రిమోట్ సెన్సింగ్‌తో పనిచేసే ఈ ఉపగ్రహం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు రెండేళ్ల పాటు అక్కడి నీటి ఆనవాళ్లు, సహజ వనరుల లభ్యంపై పరిశోధనలు చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి