చంద్రునిపై అడుగిడిన నాలుగో దేశం భారత్

శనివారం, 15 నవంబరు 2008 (02:55 IST)
భారతీయ మువ్వన్నెల జెండా శుక్రవారం రాత్రి గం.8.31ల సమయంలో చంద్రుని ఉపరితలాన్ని స్పర్శించింది. చంద్రయాన్-1 ఉపగ్రహంలోని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపి) భూమికి అత్యంత సమీపంలోని అంతరిక్ష నేస్తం చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగు పెట్టింది. దీంతో ప్రపంచంలో చంద్రుడి ఉపరితలంపై దిగిన నాలుగో దేశంగా భారత్ చరిత్రలో నిలిచింది.

ఇంతవరకు చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన చరిత్ర అమెరికా, సోవియట్ యూనియన్, జపాన్ దేశాలకు మాత్రమే ఉండగా ఇప్పుడు వీటిసరసన భారత్ కూడా సగర్వంగా నిలిచింది. ఎంఐపి రోబో సురక్షితంగా చంద్రుని తాకిన వెంటనే ఇస్రో ఈ ఘటనపై వ్యాఖ్యానిస్తూ ఈ విన్యాసం అత్యంత క్రమబద్ధంగా పూర్తయిందని పేర్కొంది.
జాబిల్లిని ముద్దాడిన త్రివర్ణ పతాకం
  శుక్రవారం.. సరిగ్గా రాత్రి 8.31 నిమిషాలు. భారత అంతరిక్ష ప్రయోగ చరిత్రలో నిరుపమాన ఘట్టం.. చంద్రుడిపై మువ్వన్నెల పతాకం జాబిలిని ముద్దాడింది. భారత కీర్తిని విశ్వవ్యాప్తంగా చాటిన ఓ మహత్తర ఘట్టానికి ఈ శుక్రవారం రాత్రి చందమామ వేదికగా నిలిచింది.      


చంద్రయాన్-1 ప్రయోగం పొడవునా దాని గమనం సజావుగా సాగిపోయిందని ఇస్రో ఛీఫ్ మాధవన్ నాయర్ చెప్పారు. మూడు లక్షల కిలోమీటర్ల పైబడి దూరాన్ని మనం సులువుగా ప్రయాణించామని నాయర్ ప్రకటించారు. బెంగళూరులో శుక్రవారం రాత్రి కిక్కిరిసిన విలేఖరుల సమావేశంలో భారతీయ త్రివర్ణ పతాకం సురక్షితంగా చంద్రునిపై వాలిందని మాధవన్ నాయర్ ప్రకటించారు.

భారతీయ తొలి మానవరహిత ఉపగ్రహం చంద్రయాన్-1 పరిశోధనతో సన్నిహితంగా ముడిపడిఉన్న కలాం... బారతీయ త్రివర్ణ పతాకం చంద్రుడిని ముద్దాడే కమనీయ దృశ్యం దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పారు. చంద్రయాన్-1 ప్రయోగాన్ని తుదివరకు లోపరహితంగా కొనసాగించిన భారతీయ అంతరిక్ష సంస్థ శాస్త్రజ్ఞుల కృషిని కలాం కొనియాడారు.

ఇస్రో శాస్త్రజ్ఞులు సాధించిన కృషి దేశానికి స్ఫూర్తిదాయకమని కలాం పేర్కొన్నారు. స్ఫూర్తితో రగుల్కొన్న యువతే భూమ్మీద అత్యంత శక్తివంతమైన వనరుగా కలాం అభివర్ణించారు. చంద్రుడిపై, అంగారక గ్రహంపై రోదసీయాత్రికులు తిరుగాడే అరుదైన క్షణాలను తాను ప్రస్తుతం కలగంటున్నానని మాజీ దేశాధ్యక్షుడు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం పేర్కొన్నారు.

చంద్రుడిపై 20 నిమిషాలపాటు ఉన్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ పరికరం ఇప్పటికే అత్యంత స్పష్టతతో కూడిన సుందరమైన చిత్రాలను తీసి పంపిందని మాధవన్ నాయర్ ప్రకటించారు. కాగా ఆ చిత్రాలను విశ్లేషించడం మొదలవుతుందని పేర్కొన్నారు. ఆదిత్య పేరుతో పిలుస్తున్న ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న దుమ్మును తిరిగి ఉపగ్రహంలోకి తీసుకువస్తుందని, దానిని ఉపగ్రహంలోని పరికరాలు విశ్లేషిస్తాయని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి