చంద్రునిపై చంద్రయాన్ నీటిని కనుగొంటుందా..?

గురువారం, 6 నవంబరు 2008 (13:20 IST)
చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా భారత్... చంద్రునిపై తన అధ్యయనాన్ని మొదలుపెట్టింది. ఈ చంద్రయాన్-1 ఉపగ్రహంతో .. నీటిని శోధించటానికి గల అవకాశాలపై దృష్టి సారించింది. ఈ ప్రయోగంతో భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలుంటాయని అంచనాలతో కూడిన విశ్లేషణలను భారత్ వెలువరించింది. అయితే చంద్రయాన్-1 చంద్రునిపై నీటి ఉనికిని కనుక్కోగలదా.. అంటే ప్రశ్నార్థమే.
చంద్రునిపై నీరు...?
  ఉపగ్రహం పంపిన ఛాయాచిత్రాల ప్రకారం చంద్రునిపై నీరు ఉన్నట్లుగా భావించే ప్రదేశమైన షాకల్టన్ క్రేటర్‌లో అలాంటి ఆనవాళ్లు ఉండకపోవచ్చని సెలెనీని నియంత్రిస్తున్న శాస్త్రవేత్తలు విశ్లేషించారు      


ఎందుకంటే.. జపాన్ దేశం చంద్రునిపైకి సెలెని ఉపగ్రహాన్ని ప్రయోగించి ఇప్పటికి ఏడాదయింది. చంద్రుడిని విస్తృతంగా అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేశారు. అయితే ఈ ఉపగ్రహం పంపిన ఛాయాచిత్రాల ప్రకారం చంద్రునిపై నీరు ఉన్నట్లుగా భావించే ప్రదేశమైన షాకల్టన్ క్రేటర్‌లో... అలాంటి ఆనవాళ్లు ఉండకపోవచ్చని... సెలెనీని నియంత్రిస్తున్న శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

వారి పరిశోధన తాలూకు వివరాలన్నీ కూడా అమెరికా జర్నల్ సైన్స్ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో గత గురువారం పొందుపరిచారు. చంద్రుని దక్షిణ ధృవం వద్ద ఉన్న ఈ షాకల్టన్ క్రేటర్‌ శాశ్వతమైన నీడ ఉన్న ప్రాంతంగా పేర్కొన్నారు. సూర్యకాంతి పెద్దగా ఉండని ఈ ప్రదేశంలో నీరు-మంచు నిల్వలు ఉండకపోవచ్చని తెలిపారు.

సాధారణంగా వేసవి కాలంలో చంద్రునిపై ఉన్న క్రేటర్ ఉపరితలభాగపు ఎగువ లోపలి అంచులపై సూర్యుని కాంతి బాగా ప్రసరిస్తుందని.. దీంతో ఛాయా చిత్రాలు స్పష్టంగా వచ్చేందుకు అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. సెలెన్ ఉపగ్రహంలోని పది మీటర్ల రిజెల్యూషన్ గల ఈ కెమేరా పంపిన ఛాయా చిత్రాల్లో నీరు ఉన్నట్లు సూచించడం లేదని పేర్కొన్నారు.

అక్కడ మంచు ఉండకపోవచ్చు.. లేదా.. మట్టిలో తక్కువ శాతంలో మంచు కలిసి పోయి ఉండవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు వివరించారు. అదలా ఉంచితే.. చంద్రయాన్-1కి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రముఖ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. చంద్రునిపై షాకల్టన్ క్రాటర్ సహా ఇతర ప్రాంతాల్లోనూ నీటిని శోధించేందుకు మూడు రకాలైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన పరికరాలను చంద్రయాన్-1 ఉపగ్రహంతోపాటు పంపారు.

వాటిల్లో ఒకటి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్మించిన హై ఎనర్జీ ఎక్స్‌-రే స్పెక్ట్రోమీటర్. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా ఈ కృత్రిమ అంతరిక్ష ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దట్టమైన మంచుతో కప్పబడ్డ నీటి నిల్వలను కూడా కనుగొనడంలో చంద్రయాన్-1లో అమర్చిన ఎక్స్-రే
స్పెక్ట్రోమీటర్ ధృవ ప్రాంతాల్లో సైతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఇస్రో వెల్లడించింది.

ఇక నేషనల్ ఏరొనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సరఫరా చేసిన మినీ సింథటిక్ యాపర్చర్ రాడార్ ( (మినీ సార్)కెమేరాలో కాంతిని ప్రసరించడానికి ఏర్పడిన సూక్ష్మ ద్వారం) చంద్రయాన్-1కి మరో అదనపు బలం. నాసా నివేదికల ప్రకారం.. చంద్రునిపై శాశ్వతంగా నీడ పడే ధృవ ప్రాంతాల్లో కొన్ని మీటర్ల లోతులో ఉన్న నీటి నిల్వలను కూడా మినీ సార్ కనుగొనగలదు.

అలాగే స్పెక్ట్రోమీటరును పోలిన చంద్రునిపై ఖనిజలవణాల వంటి వనరులను కనిపెట్టేందుకు మూన్ మైనరాలజీ మేపర్‌ కూడా ఈ చంద్రయాన్ -1లో ఉంది. నాసా సరఫరా చేసిన ఈ పరికరం.. చంద్రునిపై నీటి ఆనవాళ్లను కూడా కనిపెట్టగలదని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సాంకేతిక పరమైన సమస్యలు రాలేదు. అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగినట్లయితే... నవంబర్ నెలాఖరు నుంచి చంద్రయాన్-1.. చంద్రునిపై నీటి ఆనవాళ్లను కనిపెట్టే పనిని ప్రారంభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి