జాబిలికి మరింత దగ్గరగా 'చంద్రయాన్-1'

బుధవారం, 5 నవంబరు 2008 (03:51 IST)
భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-1 ప్రయోగం అత్యంత విజయవంతంగా కొనసాగుతున్నట్టు షార్ కేంద్రం పేర్కొంది. పధ్నాలుగు రోజుల క్రితం శ్రీహరికోటనుంచి ప్రయోగించబడిన చంద్రయాన్-1 ఉపగ్రహం ప్రస్తుతం చంద్రునికి మరింత సమీపానికి చేరిందని షార్ అధికారులు తెలిపారు.

భూమి నుంచి ప్రయాణమైన చంద్రయాన్-1 ఉపగ్రహం చంద్రుని సమీపించే దిశగా ఇప్పటివరకు 3.80 లక్షల కిలో మీటర్లు ప్రయాణించిందని అధికారులు పేర్కొన్నారు. చంద్రయాన్-1కు సంబంధించిన వివరాలను అధికారులు వివరిస్తూ మంగళవారం నాటికి చంద్రయాన్-1 ఉపగ్రహం భూ ధీర్ఘవృత్తాకారంలోని ఐదో కక్షకు చేరిందని తెలిపారు.

తద్వారా భూమి నుంచి అత్యధిక దూరానికి ప్రయాణించడంలో ఉపగ్రహం విజయం సాధించిందని వారు తెలిపారు. ఇదే తరహాలో ఉపగ్రహ ప్రయాణం కొనసాగితే అంతిమంగా ఈ నెల 8 నాటికి చంద్రునికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ఉపగ్రహం చేరుతుందని అధికారులు వివరించారు.

చంద్రునికి సమీపంగా నూరు కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తూ చంద్రునిపై ఉన్న స్ధితిగతులను భూమికి తెలియజేసేందుకు ఉద్ధేశించిన చంద్రయాన్-1 ప్రయోగం షార్ కేంద్రం నుంచి జరిగిన సంగతి తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైలురాయిగా భావిస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అయితే తర్వాతి దశల్లో చంద్రునిపైకి భారత్ స్వయంగా తన హ్యోమగాముల్ని పంపేందుకు సిద్ధం కానుంది.

వెబ్దునియా పై చదవండి