అసెంబ్లీలో ఏం జరిగిందో నివేదిక పంపండి: బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్‌!

ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (22:47 IST)
తమిళనాడు అసెంబ్లీలో శనివారం బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఆ రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు స్పందించారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎఎంపి జమాలుద్దీన్‌ను ఆదివారం ఆదేశించారు. ఆదివారం గవర్నర్ ముంబైకి వెళ్లడానికి ముందు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఏఐడీఎంకే తిరుగుబాటు బృందం నేత పన్నీర్ సెల్వంలు గవర్నర్ విద్యాసాగరరావును కలిసి శనివారం నాటి బలపరీక్షలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 
 
శనివారం శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్‌ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. 
అయితే, స్పీకర్‌ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్‌ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన గవర్నర్‌ బలపరీక్ష సందర్భంగా సభలో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
 

వెబ్దునియా పై చదవండి