పెళ్లిని అడ్డుకున్న వాట్సాప్ సందేశం...

బుధవారం, 31 ఆగస్టు 2016 (10:02 IST)
సోష‌ల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌కు ధీటుగా ఎదుగుతున్న వాట్సాప్ ఇప్పుడు పెళ్లికూతురి జీవితానికే ఎసరుపెట్టింది. అంతకుముందే  వివాహమైనట్లు వాట్సాప్ ద్వారా తెలియడంతో పెళ్లికుమారుడు వివాహాన్ని రద్దు చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఆరణి సమీపంలోని సేవూర్ గ్రామానికి చెందిన మణి కుమారుడు మహేష్ (31). ఇతనికి ఆరణి ఎస్వీనగర్‌కు చెందిన యువతితో సోమవారం రాత్రి సేవూర్‌లోని కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో రిసెప్షన్ జరిగింది.
 
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రిసెప్షన్ జరుగుతున్న సమయంలో ఆరణి దసరాపేటకు చెందిన వినాయకం నుంచి మహేష్ సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌లో ఓ సందేశం అందింది. అందులో పెళ్లికూతురు, వినాయకం కలిసి దిగిన ఫొటోలతో పాటు తనకు, యువతికి 8 నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపాడు. దీంతో మహేష్‌కు నోటమాట రాలేదు. ఈ విషయాన్ని వెంటనే తన తల్లిదండ్రులకు చెప్పాడు.
 
ఈ విషయంపై ఆగ్రహం చెందిన మహేష్ తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులను నిలదీశారు. అసలు విషయం తెలియడంతో మహేష్ పెళ్లిని రద్దు చేసి పోలీసులను ఆశ్రయించాడు. గతంలో యువతికి వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేశారని... అంతేకాదు వివాహ ఏర్పాట్లకు తనకు రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని దాన్ని తిరిగి యువతి కుటుంబ సభ్యులు చెల్లించాలని కోరారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి