"కోకోనట్ చాక్లెట్స్" భలే టేస్ట్ గురూ..!!

FILE
కావలసిన పదార్థాలు :
కోకోపొడి... వంద గ్రా.
పంచదార పొడి... 400 గ్రా.
పాలపొడి... 200 గ్రా.
వెన్న... 200 గ్రా.
ఎండుకొబ్బరి పొడి... వంద గ్రా.
మైదా... వంద గ్రా.
ఉప్పు... చిటికెడు
యాలకుల పొడి... అర టీ.
వేడినీళ్లు... అర లీ.

తయారీ విధానం :
ముందుగా వేడినీటిలో కోకోపొడి, పాలపొడి, యాలకులపొడి వేసి పేస్టులా కలిపి ఉంచాలి. చల్లారిన తరువాత అందులో మైదాపిండి వేసి మెత్తగా కలపాలి. మందంగా ఉండే ఒక పాత్ర లేదా నాన్ స్టిక్ పాన్‌లో వెన్న వేసి వేడయ్యాక పంచదార, కొబ్బరిపొడి, ఉప్పు వేసి కలుపుతూ మీడియం సెగమీద ఉంచాలి.

పంచదార కరిగి బుడగలు వస్తుండగా మంటను తగ్గించి, కోకో మిశ్రమాన్ని పోస్తూ.. స్టీలు అట్లకాడతో వేగంగా కలపాలి. అడుగు అంటకుండా కలుపుతూ మిశ్రమం ముద్దగా మారిన తరువాత పాత్రను దించి నలుచదరపు ట్రేలో వెన్నపూసి పైన చాక్లెట్ మిశ్రమాన్ని పోసి సమంగా సర్దాలి.

కాస్త ఆరిన తరువాత పలుచటి చాకుతో కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసి, చల్లబడిన తరువాత విడదీసి ప్లాస్టిక్ టిన్నులో వేసి గాలి చొరబడకుండా మూతపెట్టి ఫ్రిజ్‌లో పెడితే నెలరోజుల దాకా నిల్వ ఉంటాయి. అంతే కోకోనట్ చాక్లెట్స్ రెడీ అయినట్లే...!

వెబ్దునియా పై చదవండి