ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఠాగూర్

శుక్రవారం, 1 నవంబరు 2024 (17:34 IST)
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. దీపావళి పండుగ రోజున ఇంటి బయట టపాసులు కాల్చుతున్న కుటుంబ సభ్యులపై ఇద్దరు వ్యక్తులు వచ్చి తుపాకీతో కాల్చి చంపేశారు. తుపాకీ కాల్పులు జరిపేముందు కాళ్లకు దండం పెట్టి ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 యేళ్ల వ్యక్తి, మేనల్లుడు చనిపోగా, పదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని షాదాలో ఆకాశ్ శర్మ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు గురువారం రాత్రి  8 గంటల సమయంలో మేనల్లుడు రిషభ్ శర్మ, కుమారుడు క్రిష్ శర్మతో కలిసి ఇంటి బయట టపాసులు కాలుస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటరుపై అక్కడికొచ్చారు. ఆకాశ్ పాదాలను తాకి నమస్కరించారు. ఆ వెంటనే ఆకాశ్ భయపడి ఇంట్లోకి పరిగెత్తడం, నిందితుల్లో ఒకడు తుపాకి తీసి కాల్పులు జరపడం క్షణాల్లో జరిగిపోయాయి.
 
బాంబులు అంటించే ప్రయత్నంలో ఉన్న రిషభ్ తొలుత ఇదేమీ పట్టించుకోలేదు. తుపాకి పేలిన శబ్దం రావడంతో అప్పుడు గమనించి పారిపోతున్న నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు అతడిపైనా కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రి తరలించగా ఆకాశ్, రిషభ్ అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. క్రిష్‌కు చికిత్స కొనసాగుతోంది.
 
నిందితులు తనకు తెలుసని, వారితో సంవత్సరాలుగా భూతగాదా ఉందని ఆకాశ్ భార్య తెలిపారు. ఆకాశ్ సోదరుడు యోగేశ్ మాట్లాడుతూ నిందితులు గత నెలలో తమ ఇంటిపైనా కాల్పులు జరిపారని, అయితే పోలీసులు ఈ కేసులో తమనే తిరిగి ఇరికించారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు తమ ఫోన్ల నుంచి డిలీట్ చేయడమేకాకుండా తామే గొడవలకు దిగుతున్నామని ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Farsh Bazaar double murder cctv
A man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f

— Shehla J (@Shehl) November 1, 2024
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి ఐదు రౌండ్ల బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత శత్రుత్వంతోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు