శెనగలతో పిల్లల కోసం టేస్టీ చాట్

సోమవారం, 22 జనవరి 2018 (16:49 IST)
పిల్లల స్నాక్స్ బాక్సును షాపుల్లో అమ్మే స్నాక్సులతో నింపేస్తున్నారా? చిప్స్ వంటి చిరుతిళ్లను పిల్లలకు స్నాక్స్‌గా ఇచ్చి పంపుతున్నారా అయితే... ఇక ఆపండి.. షాపుల్లో అమ్మబడే స్నాక్స్ ద్వారా అలెర్జీలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నాక్స్ కోసం ఉపయోగించే నూనెల ద్వారా పిల్లల్లో నోటిపూత తప్పదని వారు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
శెనగల ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. శెనగలను స్నాక్స్‌గా లేకుంటే రోజూ ఓ కప్పు పిల్లలకు తినిపిస్తే ఆరోగ్యంగా, బలిష్టంగానూ తయారవుతారు. ఇంకా శెనగలు ఊబకాయం, బలహీనత, అల్సర్, మధుమేహం, గుండెజబ్బులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి శెనగలతో పిల్లలకు నచ్చే స్నాక్స్.. చాట్ ఐటమ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
శెనగలతో టేస్టీ చాట్..
కావలసిన పదార్థాలు: శెనగలు - ఒక కప్పు, 
ఉల్లి, టొమాటో ముక్కలు - చెరో పావు కప్పు 
కీరదోసకాయ ముక్కలు - పావుకప్పు, 
ఆమ్‌చూర్‌ పొడి - అర టీస్పూన్, 
చాట్‌ మసాలా, మిరియాల పొడి - తగినంత, 
కొత్తిమీర తరుగు - కొద్దిగా, 
పచ్చిమిర్చి తరుగు- ఒక స్పూన్
చిక్కటి చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం - అర నుంచి ఒక టీస్పూన్,
తేనె- ఒక టీ స్పూన్
శొంఠిపొడి - కొద్దిగా, 
కారా బూందీ - తగినంత. 
 
తయారీ విధానం : శుభ్రం చేసుకున్న శెనగలను ఐదు గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన శెనగల్లో కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఉడికాక నీళ్లు వంపేసి శెనగలు చల్లారాక వాటిలో కీర ముక్కలు, ఉల్లి, టమోటా ముక్కలు, కొత్తిమీర తరుగుతో పాటు మిగిలిన పదార్థాలన్నింటికీ కలపాలి. ఈ చాట్‌పైన బూందీని కలిపి సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు