కాలినడక ఛత్తీస్‌గఢ్ వెళ్లిన వలస కూలీలకు కరోనా పాజిటివ్

గురువారం, 7 మే 2020 (11:36 IST)
లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణా లేకపోవడంతో కాలినడకన సొంత రాష్ట్రానికి వెళ్లిన పలువురు వలస కూలీలకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వలస కూలీలు హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్లారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వలస కూలీలు తమతమ సొంతూర్ళకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, కొందరు కూలీలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కాలినడక బయలుదేరారు. వారంతా పది రోజుల పాటు నడక సాగించి చివరకు తమ సొంతరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు.
 
అయితే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధికారులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో 14 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో ఐదుగురు హైదరాబాద్​ నుంచి గత పది రోజులుగా నడుచుకుంటూ.. దారిలో కనిపించిన వారిని లిఫ్ట్ అడుగుతూ ఛత్తీస్​గఢ్ చేరుకున్నారు. 
 
హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌ జిల్లాకు వెళ్లిన ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ బాధితులతో సన్నిహితంగా ఉన్న 200 మందిని అధికారులు క్వారంటైన్‌కు పంపారు. 14 మంది బాధితుల్లో ఆరుగురు కబీర్‌ధామ్‌ జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ ఐదుగురిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు