దేశ రాజధాని సరిహద్దులో రైతుల ఆందోళన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా సోకడం తాజాగా కలకలం రేపింది. ఢిల్లీ-హర్యానా మార్గంలోని సింఘు సరిహద్దు వద్ద పోలీసు బలగాలకు నేతృత్వం వహిస్తున్న డీసీపీ, అదనపు డీసీపీకి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.
నిరసన చేస్తున్న రైతులు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాపించే ముప్పు ఉందని ఇప్పటికే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా కేసులు కలవరపెడుతున్నాయి.
మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన శివారుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 16వ రోజుకు చేరింది. తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు బైఠాయించి తమ నిరసన సాగిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారా కూడా కొనసాగుతోంది. కాగా.. ఆందోళన చేస్తున్న రైతులకు కొన్ని ఎన్జీవోలు కొవిడ్ పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి.