ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 89 మంది మృతి..

శనివారం, 8 ఆగస్టు 2020 (09:32 IST)
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 89మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం 10 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2 ల‌క్ష‌లు దాటిపోయింది. 
 
ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో 62,938 క‌రోనా శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా అందులో 10,171 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. 
 
శుక్రవారం ఒక్కరోజే 89 మంది మృతి చెంద‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. పాజిటివ్ కేసుల సంఖ్య 2,04,065కి చేరుకోగా.. క‌రోనాబారినప‌డిన 1,17,569 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి... కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన‌ వారి సంఖ్య 1,842 మందికి చేరింది.
 
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 85 శాతం నుంచి 90 శాతం వరకు క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ రేట్ 8.87 శాతం ఉంటే.. రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 8.56శాతం ఉందని ఆయన అన్నారు. అలాగే మరణాల రేటు దేశంలో 2.07 శాతం ఉండగా.. రాష్ట్రం 0.89 శాతం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. 
 
ప్రతీ పది లక్షల మందిలో 43,059 మందికి పరీక్షలు చేస్తున్నామని.. అలాగే శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రం సగటు కన్నా ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు