ఆంధ్రప్రదేశ్‌పై కరోనా వైరస్ రక్కసి : 341 టన్నుల ఆక్సిజన్ చాలడం లేదు...

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (21:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా వైరస్ రక్కసి పగబట్టింది. దీంతో రోజుకు 341 టన్నుల ఆక్సిజన్ సైతం కరోనా రోగులకు సరిపోవడం లేదు. అదేసమయంలో పలు ప్రాంతాల్లో ఆక్సిజన్‌ను వృథా చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించాల్సివుంది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతున్న విషయం తెల్సిందే. కొన్నిరోజుల వ్యవధిలోనే రోజువారీ కేసుల సంఖ్య వేల నుంచి లక్షలకు పెరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దాంతో ప్రభుత్వం మరికొన్ని కఠిన ఆంక్షలు విధించింది. 
 
రాష్ట్రంలో ఇకపై ఏ వేడుక అయినా 50 మందికి మించరాదని స్పష్టం చేసింది. జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూసివేయాలని ఆదేశించింది. ప్రజారవాణా, సినిమా హాళ్లు 50 శాతం సామర్థ్యంతోనే నిర్వహించాలని పేర్కొంది. 
 
ప్రభుత్వ, ప్రైవేటు పని ప్రదేశాల్లో ఒక్కో ఉద్యోగికి మధ్య 50 గజాల దూరం పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో 11 వేల రెమ్ డెసివిర్ ఇంజక్షన్ వయల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి 341 టన్నుల ఆక్సిజన్ వస్తున్నా సరిపోవడంలేదని వెల్లడించారు. అయితే, చాలా చోట్ల ఆక్సిజన్ వృథా అవుతోందని సింఘాల్ విచారం వ్యక్తంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు