ఏపీలో కేసులు పెరుగుతున్నాయి.. జర జాగ్రత్తగా ఉండాలె : మంత్రి ఆళ్ళ నాని

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (17:19 IST)
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయనీ, అందువల్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరిందని చెప్పారు. ఈ  కేసులో 140 మంది ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారని తెలిపారు. 
 
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. సోమవారం నుంచి విశాఖలో కూడా ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురం ప్రాంతాల్లో ల్యాబ్‌లు పనిచేస్తుండగా, కొత్తగా గుంటూరు, కడప ప్రాంతాల్లో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 
 
ఇకపోతే, ఏపీలో తొలిసారి కలకలం రేగింది. రాష్ట్రంలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల మహిళ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మార్చి 17వ తేదీన ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆమెకు కరోనా సోకింది. ఆమెను క్వారంటైన్‌కు పంపించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 
 
మరోవైపు తల్లి, కుమారుడితో కాంటాక్ట్‌లోకి వచ్చిన 29 మందిని క్వారంటైన్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఏపీలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించడంతో... విజయవాడ వాసులు హడలి పోతున్నారు. ఎంతమందికి వైరస్ సోకిందో అని ఆందోళన చెందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు