కరోనా విషయంలో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమై, రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరు తమ రాష్ట్రానికి వచ్చినా ముందుగా ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ-పాస్ తీసుకోవడం తప్పనిసరని ప్రకటించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
కేరళ సహా దేశంలోని ఇంకే ప్రాంతం నుంచి వచ్చే వారైనా, విదేశాల నుంచి వచ్చే వారైనా ఈ-పాస్ పొందాల్సిందేనని స్పష్టం చేసింది. వేరే ప్రాంతాల నుంచి వస్తున్న వారి కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే వారు ముందుగానే కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ను జత పరుస్తూ, అనుమతి తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
చెన్నైలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో, నగరంలోని 39 వేల వీధుల్లో చేపట్టిన పరిశీలనలో 1,277 వీధుల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, 10 రోజుల్లోనే 1,517 మంది కరోనా లక్షణాలకు గురయ్యారని తెలిపింది. 20 వీధుల్లో అత్యధికంగా ముగ్గురు, 74 వీధుల్లో ఇద్దరు, 1,600 వీధుల్లో ఒకరు చొప్పున కరోనా బారిన పడ్డారు.