ఆఫ్రికా దేశాల్లో ఒకటైన దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ బి.1.1.529గా గుర్తించగా, దీనికి "ఒమిక్రాన్" అనే నామకరణం చేశారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. ఈ వైరస్ ఇప్పటికే పలుదేశాలకు పాకింది. ముఖ్యంగా, 32 రకాల మ్యుటేషన్‌తో ఈ వైరస్ హడలెత్తిస్తుంది.
ఈ వైరస్ ప్రభావం, పనితీరుపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ, ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ సోకి, తిరిగి కోలుకున్న రోగులకు కూడా మరోమారు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌లో జన్యు ఉత్పరివర్తనాలు ఉండటం ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారు.
కాగా, సౌతాఫ్రికాలోని ఓ హెచ్ఐవి రోగిలో ఈ వైరస్‌ను గుర్తించారు. అతనిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఆ తర్వాత బోట్సువానా, హాంకాంగ్ దేశాల్లో ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి.