తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ : ఏపీలో 10 వేలు - టీఎస్‌లో 3 వేల కేసులు

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (11:02 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య మరింతగా అధికంగా ఉంది. ఇక్కడ ప్రతి రోజూ పదివేలకు తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే తెలంగాణాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 
 
ముఖ్యంగా, ఏపీ విషయానికి వస్తే... రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా వ్యాపిస్తోంది. అదేసమయంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వెల్లడించిన గణాంకాల మేరకు 84 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,053కి పెరిగింది. 
 
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది కన్నుమూశారు. ఇక, గడచిన 24 గంటల్లో 10,368 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో భారీగా కొత్త కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,139కి చేరింది. తాజాగా 9,350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 1,01,210 మంది చికిత్స పొందుతున్నారు
 
ఇకపోతే, తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,892 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,240 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,589కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,341 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 97,402 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 846కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 477 కరోనా కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు